
ఆభరణాల గురించి సీఎం రేవంత్‌కు వివరిస్తున్న మలబార్ సంస్థ ప్రతినిధులు. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం: సీఎం రేవంత్
పెట్టుబడిదారులకు, వారి ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుంది
మహేశ్వరంలో మలబార్ బంగారు, వజ్రాభరణాల తయారీ సంస్థ ప్రారంభం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తుల ఎగుమతి విషయంలో మాకు దేశంలోని ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు. అమెరికా, సింగపూర్, కొరియా, యూకే వంటి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలతోనే మాకు పోటీ ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై సహా దేశంలోని ఏ ఒక్క నగరం కూడా మన హైదరాబాద్‌తో పోటీ పడలేదు..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
మహేశ్వరం మండలంలోని పారిశ్రామిక జనరల్ పార్క్‌లో 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మలబార్ బంగారు, వజ్రాభరణా ల తయారీ సంస్థను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
ఇక్కడ పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు
‘తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. ఇక్కడ పెట్టుబడి పెట్టిన వారికి, వారి ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుంది. గత 20 ఏళ్లలో పాలకులు మారారే కానీ.. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆయా ప్రభుత్వాల విధానాలు మాత్రం మారలేదు. మేం పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి దారులను కడుపులో పెట్టి చూసుకుంటుంది. ఇక్కడ పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించొచ్చు.
కొనుగోళ్లలో తెలుగు మహిళల ముందంజ
బంగారు, వజ్రాభరణాల కొనుగోలు విషయంలో ఇతర రాష్ట్రాల మహిళలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల మహిళలే ముందుంటారు. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మహిళలు ఉంటారు. బంగారు ఆభరణాల తయారీకి మహేశ్వరం అనువైన ప్రదేశం. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేయడం అబినందనీయం.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మహేశ్వరం, ముచ్చర్ల, బేగరి కంచె కేంద్రంగా 30 వేల ఎకరాల్లో భారత ఫ్యూచర్ సిటీని తీర్చి దిద్దబోతున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాదు వారికి లభాలు చేకూరేలా ప్రభుత్వం సహకరిస్తుంది..’అని సీఎం హామీ ఇచ్చారు.
తయారీ రంగానికీ హబ్‌గా మార్చేందుకు కృషి: శ్రీధర్‌బాబు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా రంగాల మాదిరే తయారీ రంగానికీ తెలంగాణను హబ్‌గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. తెలంగాణ తయారీ రంగం గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) 2022–23లో రూ.1.34 లక్షల కోట్లు ఉండగా, 2023–24లో 9 శాతం వృద్ధితో రూ.1.46 లక్షల కోట్టకు చేరిందని తెలిపారు.
తెలంగాణ జీఎస్‌డీపీలో తయారీ రంగం వాటా 19.5 శాతం ఉండగా, జాతీయ స్థాయిలో ఇది 17.7 శాతమే ఉందని చెప్పారు. తెలంగాణ తయారీ రంగ ఎగుమతులు రూ.1.2 లక్షల కోట్ల మార్కు దాటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.