భారత్‌కే ఫ్యూచర్‌: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Says We will build India Future City | Sakshi
Sakshi News home page

భారత్‌కే ఫ్యూచర్‌: సీఎం రేవంత్‌

Jun 29 2025 4:31 AM | Updated on Jun 29 2025 4:31 AM

CM Revanth Reddy Says We will build India Future City

పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు పొన్నం,శ్రీధర్‌బాబు, ఎంపీ అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు

ప్రపంచమంతా మెచ్చేలా భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తాం 

గచ్చిబౌలిలో పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

ప్రపంచశ్రేణి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నాం 

ఇందుకోసం 100 ఏళ్ల అభివృద్ధికి ప్రణాళిక రచిస్తున్నాం 

రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి కోర్‌ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా విభజన 

డిసెంబర్‌ 9లోగా విజన్‌ డాక్యుమెంట్‌ 

కాంగ్రెస్‌ వేసిన బీజంతోనే హైటెక్‌ సిటీ ఏర్పాటు 

రాష్ట్రానికి మోదీ ఇచ్చింది, కిషన్‌రెడ్డి తెచ్చింది ఏముంది? 

అభివృద్ధికి నేతలంతా కలిసి రావాలి

చందానగర్‌: హైదరాబాద్‌ను ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని.. ప్రపంచమంతా మెచ్చేలా ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ని నిర్మించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే తెలంగాణను కోర్‌ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా.. మూడు ప్రాంతాలుగా విభజించి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో ముందుకు వెళ్తామని చెప్పారు. 

రాష్ట్ర సమ్మిళిత, సమగ్రాభివృద్ధి కోసం రూపొందిస్తున్న తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను డిసెంబర్‌ 9లోగా విడుదల చేస్తామని వెల్లడించారు. గచ్చిబౌలిలో కొండాపూర్‌ నుంచి ఔటర్‌ రింగురోడ్డు వరకు రూ. 182.72 కోట్ల వ్యయంతో, ఆరు లేన్లతో నిర్మించిన దివంగత పి. జనార్దన్‌రెడ్డి ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ లోపలి భాగంలో కోర్‌ అర్బన్‌గా, ఓఆర్‌ఆర్‌ అవతలి నుంచి రీజనల్‌ రింగ్‌రోడ్డు వరకు సెమీ–అర్బన్‌గా, రీజనల్‌ రింగ్‌రోడ్డు అవతలి భాగాన్ని గ్రామీణ ప్రాంతంగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. 

ముఖ్యంగా ఓఆర్‌ఆర్‌ ఆవలి వైపున 30 వేల ఎకరాల్లో ప్రపంచశ్రేణి భారత్‌ ఫ్యూచర్‌ సిటీని ప్రతిపాదించామని.. అందులో క్రీడలు, ఏఐ, ఐటీ, కాలుష్యరహిత ఫార్మా రంగాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫ్యూచర్‌ సిటీలో పచ్చదనం కోసం దాదాపు 15 వేల ఎకరాల్లో పార్కులను, మిగతా ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించారు. వచ్చే వందేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రణాళిక రచిస్తున్నామన్నారు. 

హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దేలా.. 
‘వాయు కాలుష్యంతో ఢిల్లీ, విపరీతమైన ట్రాఫిక్‌ సమస్యలతో బెంగళూరు, వరదలతో చెన్నై నగరాలు అతలాకుతలమవుతున్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నగరంలో కాలుష్యాన్ని నివారించాలన్న లక్ష్యంతోనే విద్యుత్‌ వాహనాలపై రిజిస్ట్రేషన్‌ పన్నులను పూర్తిగా రద్దు చేశాం. జంట నగరాల్లో తిరుగుతున్న 3 వేల ఆర్టీసీ బస్సులను ఓఆర్‌ఆర్‌ బయటి ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో వచ్చే ఏడాదిలోగా 3 వేల విద్యుత్‌ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 

మోదీ, కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం ఇచ్చారు, తెచ్చారు? 
రాష్ట్రానికి ప్రధాని మోదీ ఇచ్చింది, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెచ్చింది ఏముందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీకి యుమునా ఫ్రంట్, గుజరాత్‌కు నర్మదా రివర్‌ ఫ్రంట్‌ ఇచ్చారని.. తెలంగాణకు మూసీ రివర్‌ ఫ్రంట్‌ మాత్రం ఎందుకివ్వరని నిలదీశారు. చెన్నై, బెంగళూరు, ఏపీకి మెట్రో ఇచ్చారని.. కానీ హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు మాత్రం మొండిచేయి చూపారని మండిపడ్డారు. 

తెలంగాణపై ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు. నాలాలు, చెరువుల ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపడితే దీన్ని కొందరు రాజకీయం చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని రేవంత్‌ విమర్శించారు. 2028 వరకు రాజకీయాలు వద్దని.. వచ్చే మూడేళ్లపాటు రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఇటీవల ‘ఎన్‌ కన్వెన్షన్‌’ కూల్చివేత అనంతరం సినీనటుడు నాగార్జున అభివృద్ధిలో భాగస్వామినవుతానని ముందుకొచ్చారని సీఎం గుర్తుచేశారు. రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి చెరువును అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని చెప్పారన్నారు. 

1992లోనే ఐటీ రంగానికి పునాది 
హైదరాబాద్‌లో 1992లోనే హైటెక్‌ సిటీకి రాజీవ్‌గాంధీ టెక్నాలజీ పేరిట పునాది పడిందని.. అందుకోసం దివంగత పీజేఆర్‌ నాయకత్వంలో అప్పటి సీఎం నెదురుమల్లి జనార్దన్‌రెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శంకుస్థాపన చేశారని సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. ఆ తర్వాత కాలంలో హైటెక్‌ సిటీ, సైబరాబాద్‌ సిటీ అభివృద్ధి చెందాయన్నారు. 

అందుకు కాంగ్రెస్‌ పార్టీ వేసిన పునాదులే కారణమన్నారు. పేదల సమస్యలు తీరుస్తూ జంట నగరాల అభివృద్ధికి దివంగత పీజేఆర్‌ అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. పీజేఆర్‌ పేరును ఫ్లైఓవర్‌కు పెట్టుకోవడం సముచితమన్నారు. తగిన స్థలం గుర్తిస్తే పీజేఆర్‌ విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

నాడు భయం.. నేడు కళకళ 
గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ప్రాంతంలో ఒకప్పుడు సాయంత్రం 6 దాటితే జనసంచారం లేక అక్కడ నివసించే వారు భయపడే పరిస్థితి ఉండేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోయిందని.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌ లాంటి ఫార్చూన్‌ 500 కంపెనీలతో కళళలాడుతోందని చెప్పారు. దీనివల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. 

ఆటంకాలను అధిగమించి కంచ గచ్చిబౌలి భూములను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌ చెప్పారు. అక్కడి భూముల అభివృద్ధికి ఏర్పడిన ఆటంకాలు తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు. కొత్త కంపెనీల ఏర్పాటుతో లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. మరింత మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే రూ. 2.8 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను తమ ప్రభుత్వం సాధించిందని సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. 

కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, మేయర్‌ విజయలక్షి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, ఉన్నతాధికారులు, పీజేఆర్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement