జెర్సీ మారింది... బోణీ కొట్టింది | Telugu Titans beats Gujarat Fortunegiants | Sakshi
Sakshi News home page

జెర్సీ మారింది... బోణీ కొట్టింది

Aug 12 2019 5:16 AM | Updated on Aug 12 2019 5:16 AM

Telugu Titans beats Gujarat Fortunegiants - Sakshi

అహ్మదాబాద్‌: మారిన జెర్సీ రంగు తెలుగు టైటాన్స్‌ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో అందని ద్రాక్షలా ఉన్న గెలుపు ఎట్టకేలకు తెలుగు టైటాన్స్‌ను పలకరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 30–24తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ను ఓడించి ఈ లీగ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. టైటాన్స్‌ తరఫున సిద్ధార్థ్‌ దేశాయ్, విశాల్‌ భరద్వాజ్‌లు చెరో ఏడు పాయింట్లతో జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. మ్యాచ్‌ మొత్తంలో 16 టాకిల్‌ పాయింట్లు, 11 రైడ్‌ పాయింట్లతో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్‌ చేసిన తెలుగు జట్టు గెలుపు బోణీ కొట్టింది.  

సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పసుపు రంగు జెర్సీతో బరిలో దిగిన టైటాన్స్‌... గుజరాత్‌తో మ్యాచ్‌లో మాత్రం నల్ల రంగు జెర్సీతో ఆడింది. కొత్త జెర్సీ రంగు ఏం అదృష్టం తెచ్చిందో ఏమో కానీ.. ప్రత్యర్థి జట్టును ఆట ఆరంభమైన ఏడో నిమిషంలోనే ఆలౌట్‌ చేసింది. మొదటి అర్ధ భాగంలో సిద్ధార్థ్‌ రైడింగ్‌లో చెలరేగితే... రెండో అర్ధ భాగంలో విశాల్‌ భరద్వాజ్‌ తన పట్టుతో ప్రత్యర్థి రైడర్లను పట్టేశాడు. దీంతో గుజరాత్‌ సొంత మైదానంలో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 30–33తో హరియాణా స్టీలర్స్‌ చేతిలో ఓడింది. హరియాణా రైడర్‌ వికాస్‌ ఖండోలా 12 పాయింట్లతో రాణించాడు. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్‌ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్‌; యూపీ యోధతో బెంగళూరు బుల్స్‌ తలపడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement