‘అందువల్లే వన్డే సిరీస్‌ గెలిచాం’

Tamim Iqbal Says Patience is the Key on West Indian Wickets After Winning ODI Series - Sakshi

బాసెటెర్‌: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ కోల్పోయినప్పటికీ, వన్డే సిరీస్‌ గెలవడంపై బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. వన్డే ఫార్మాట్‌ అనేది తమ ఆట తీరుకు సరిగ్గా సరిపోతుందని పేర్కొన్న తమీమ్‌.. విండీస్‌తో సిరీస్‌ సాధించడంలో ఓపిక అనేది కీలక పాత్ర పోషించిందన్నాడు.

‘టెస్టు సిరీస్‌లో మేము గొప్పగా ఆడలేదు.. కానీ మంచి ప్రాక్టీస్‌ లభించింది. అది వన్డే సిరీస్‌కు ఎంతగానో ఉపయోగపడిందనే అనుకుంటున్నా. సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడితే పరుగులు సాధించడం కష్టం కాదు. అదే ప‍్రయోగాన్ని వన్డే సిరీస్‌లో అవలంభించాం. మా జట్టు మేనేజ్‌మెంట్‌ నన్ను సుదీర్ఘమైన బ్యాటింగ్‌ చేయాలని ఆదేశించింది. ఆ విషయంలో నేను సక్సెస్‌ అయ్యా. వెస్టిండీస్‌లో వికెట్‌పై రాణించడం ఎప్పుడూ సులభం కాదు. ఇక్కడ కావాల్సింది ఓపిక. నేను భారీ పరుగులు చేశానంటే అందుకు కారణం ఓపిగ్గా ఉండటమే. విండీస్‌తో వన్డే సిరీస్‌లో ఓపిక అనేది కీలక పాత్ర పోషించదని కచ్చితంగా చెప్పగలను. దాంతోనే మేము చాలా కాలం తర్వాత విండీస్‌ గడ్డపై సిరీస్‌ గెలిచాం’ అని తమీమ్‌ పేర్కొన్నాడు. విండీస్‌తో సిరీస్‌ నిర్ణయాత్మక వన్డేలో బంగ్లాదేశ్‌ 18 పరుగుల తేడాతో  విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తమీమ్‌ ఇక్బాల్‌(103) శతకంతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top