శ్రీశాంత్‌కు భారీ ఊరట

Supreme Court lifts life ban on S Sreesanth - Sakshi

న్యూఢిల్లీ: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ గత కొన్నేళ్లుగా పోరాడుతున్న క్రికెటర్‌ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ శ్రీశాంత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ ఆశోక భూషణ్‌-జస్టిస్‌ కేఎమ్‌ జోసెఫ్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ విధానాన్ని సుప్రీం తప్పుబట్టింది. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం నిర్ణయాన్ని మూడు నెలల్లో పునః సమీక్షించుకోవాలని పేర్కొంది.

ఈ రోజు విచారణ సందర్భంగా శ్రీశాంత్‌పై నిషేధం అనేది చట్ట పరంగానే జరిగిందంటూ బీసీసీఐ వాదించింది. అయితే శ్రీశాంత్‌ తరఫు న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ మాత‍్రం తన వాదనను బలంగా వినిపించారు. కేవలం మ్యాచ్‌ ఫిక్సర్లు శ్రీశాంత్‌ను కలిసిన విషయాన్ని బోర్డుకు చెప్పని కారణంగా అతనిపై జీవిత కాల నిషేధం విధించడం తగదంటూ వాదించారు.ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం సరైనది కాదని, దాన్ని పునరాలోచించుకోవాలంటూ బీసీసీఐకి స్పష్టం చేసింది.  

2013లో జరిగిన ఐపీఎల్‌–6 సీజన్‌లో శ్రీశాంత్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అరెస్ట్‌ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్‌ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్‌ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2017 ఆగస్టులో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కేరళ సింగిల్‌ బెంచ్‌ హైకోర్టు ఎత్తివేయగా, ఆపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై 2017 అక్టోబర్‌లో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కొనసాగించేందుకు కేరళ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ‍్చింది. ఈ తీర్పును సవాల్‌ చేసిన శ్రీశాంత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top