‘మంకీ’ పెట్టిన చిచ్చు..!

Special Story About India VS Australia 2007 Test Match - Sakshi

అత్యంత వివాదాస్పదంగా ముగిసిన భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు

ముదిరిన హర్భజన్, సైమండ్స్‌ గొడవ

సిడ్నీలో 2007–08 సిరీస్‌ హైడ్రామా

ఒక ఆటగాడు తన చర్యలతోనో, వ్యాఖ్యలతోనే వివాదం రేపడం... అతనిపై ఐసీసీ చర్య తీసుకోవడం క్రికెట్‌ చరిత్రలో లెక్క లేనన్ని సార్లు జరిగాయి. అయితే ఇద్దరు ఆటగాళ్ల మధ్య మైదానంలో సాధారణంగా కనిపించిన గొడవ చివరకు ముదిరి ఇరు దేశాల బోర్డుల మధ్య గొడవగా మారడం... దాదాపు న్యాయస్థానంలో జరిగినట్లుగా లాయర్లతో కలిసి వివాద పరిష్కారం చేయాల్సి రావడం అరుదు. అయితే భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన 2007–08 సిరీస్‌ టెస్టు అలాంటిదే. అంపైర్ల తప్పుడు నిర్ణయాలతో అప్పటికే భారత్‌కు ఓటమి ఎదురు కాగా, హర్భజన్‌పై ‘జాతి వివక్ష’ వ్యాఖ్యల ఆరోపణలు వెరసి టీమిండియా సిరీస్‌ను బాయ్‌కాట్‌ చేసే వరకు వచ్చింది. ‘మంకీ గేట్‌’గా ఈ ఉదంతానికి మచ్చ పడింది.

అనిల్‌ కుంబ్లే నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటించిన భారత జట్టు మెల్‌బోర్న్‌లో జరిగిన తొలి టెస్టులో 337 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. అయితే కోలుకున్న టీమ్‌ సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 463 పరుగులు చేయగా, సచిన్‌ (153), లక్ష్మణ్‌ (109) సెంచరీల సహాయంతో 532 పరుగులు చేసిన భారత్‌ 69 పరుగుల ఆధిక్యం అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 401 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసిన ఆసీస్‌ చివరి రోజు భారత్‌ ముందు కనీసం 73 ఓవర్లలో 333 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్‌కు ఇదేమీ పెద్ద కష్టం కాదు. అయితే ఇద్దరు అంపైర్లు స్టీవ్‌ బక్నర్, మార్క్‌ బెన్సన్‌ తప్పుడు నిర్ణయాల కారణంగా చివరకు జట్టు ఓటమిపాలైంది.

ద్రవిడ్‌ బ్యాట్‌కు బంతి తగలకపోయినా అవుట్‌ ఇవ్వడం, స్లిప్‌లో గంగూలీ ఇచ్చిన క్యాచ్‌ను క్లార్క్‌ అందుకున్నప్పుడు బంతి నేలను తాకున్నా అవుట్‌గా ప్రకటించడం, ఇందు కోసం మూడో అంపైర్‌ను అడక్కుండా మరో ఫీల్డర్‌ పాంటింగ్‌ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవడం, ఆపై ధోనిని తప్పుడు ఎల్బీడబ్ల్యూ ప్రకటించడం... ఇలా అన్నీ భారత్‌ ఓటమికి కారణంగా నిలిచాయి. అయినా సరే 70 ఓవర్లు ముగిసే సరికి 210/7తో మెరుగ్గా కనిపించిన జట్టు మైకేల్‌ క్లార్క్‌ వేసిన 71వ ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయి 112 పరుగులతో ఓడింది. మరో 2.1 ఓవర్లు ఆడితే మ్యాచ్‌ డ్రాగా ముగిసిపోయేది.

అసలు గొడవ... 
టెస్టు మూడో రోజు హర్భజన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య చిటపటలు సాగుతూనే ఉన్నాయి. మరో ఎండ్‌లో ఉన్న సచిన్‌ తన సహచరుడిని వారిస్తూనే ఉన్నాడు. చివరకు సైమండ్స్‌ ప్రవర్తన శృతి మించడంతో హర్భజన్‌ ‘తేరీ మాకీ...’ అంటూ తిట్టేశాడు. అది అంతటితో ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ తన రూపాన్ని కోతితో పోల్చినట్లుగా భజ్జీ ‘మంకీ’ అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడంటూ సైమండ్స్‌ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న రిఫరీ మైక్‌ ప్రొక్టర్‌ హర్భజన్‌పై మూడు టెస్టుల నిషేధం విధించాడు. దాంతో భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాతి టెస్టు కోసం కాన్‌బెర్రాకు వెళ్లకుండా సిడ్నీలోనే ఉండిపోయింది. అవసరమైతే సిరీస్‌ను రద్దు చేసుకుంటామని హెచ్చరించింది.

విచారణ సాగిందిలా... 
నిబంధనల ప్రకారం భారత్‌ రిఫరీ నిర్ణయంపై అప్పీల్‌ చేసింది. అయితే అది ‘జాతి వివక్ష’కు సంబంధించి అంశం కావడంతో వ్యవహారం ముదిరింది. చివరకు అప్పీల్‌ కమిషనర్‌ జాన్‌ హాస్నన్‌ ముందు ఇరు వర్గాలు విచారణకు హాజరయ్యాయి. టీమ్‌ అసిస్టెంట్‌ మేనేజర్, హైదరాబాద్‌కు చెందిన ఎంవీ శ్రీధర్‌ ఈ మొత్తం వ్యవహారంలో అందరినీ సమన్వయం చేసుకుంటూ కీలక పాత్ర పోషించారు. భారత్‌ భజ్జీకి మద్దతుగా తమ వాదనకే కట్టుబడింది. సాక్షిగా సచిన్‌ కూడా హర్భజన్‌ ‘మాకీ’ మాత్రమే అన్నాడని చెప్పాడు. భజ్జీ వివాదస్పద వ్యాఖ్య చేసినట్లుగా ఎలాంటి సాక్ష్యం లేదంటూ తమ వాదనను వినిపించడంలో టీమిండియా సఫలమైంది. చివరకు భజ్జీపై జాతి వివక్ష ఆరోపణలు కొట్టివేసిన కమిషనర్‌ కేవలం 50 శాతం జరిమానాతో సరిపుచ్చారు.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత ‘ఒక్క జట్టు మాత్రమే నిజమైన క్రీడా స్ఫూర్తితో ఆడింది’ అంటూ కుంబ్లే చేసిన వ్యాఖ్య చరిత్రలో నిలిచిపోయింది. సిడ్నీ అనుభవంతో కసి పెరిగిన భారత జట్టు పెర్త్‌లో జరిగిన తర్వాతి టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చి 72 పరుగులతో అద్భుత విజయం సాధించింది. ఈ వివాదం జరిగిన దాదాపు రెండు నెలలకే భారత్‌లో ఐపీఎల్‌ వేలం జరిగింది. అయితే గొడవతో సంబంధం లేకుండా అత్యధిక మొత్తానికి అమ్ముడైన విదేశీ ఆటగాడిగా సైమండ్స్‌ నిలిచాడు. ఆ తర్వాత 2011 ఐపీఎల్‌ సీజన్‌లో హర్భజన్, సైమండ్స్‌ ఒకే జట్టు ముంబై ఇండియన్స్‌ తరఫున కలిసి ఆడటం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top