హతవిధీ... సఫారీ ఆశలు ఆవిరి!

South Africa-West Indies match called off due to Rain - Sakshi

విండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ వర్షార్పణం

సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం

సౌతాంప్టన్‌: ఈ ప్రపంచకప్‌లో మరో మ్యాచ్‌ వర్షార్పణమైంది. దక్షిణాఫ్రికాను నిండా ముంచేసింది. ఇంకా విజయాల బోణీ కొట్టని సఫారీ జట్టుకు ఇది కీలకమైన పోరు. కానీ ఈ మ్యాచ్‌ రద్దవడంతో డు ప్లెసిస్‌ సేన సెమీస్‌ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. మొత్తానికి దక్షిణాఫ్రికాను ఈ మెగా ఈవెంట్‌లో ప్రత్యర్థులే కాదు వర్షం కూడా దెబ్బకొట్టింది. వానతో ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌ ఎంతోసేపు సాగలేదు. వర్షంతో ఆట నిలిచే సమయానికి దక్షిణాఫ్రికా 7.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. టాస్‌ నెగ్గిన వెస్టిండీస్‌ మొదట ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

డికాక్‌ (17 నాటౌట్‌; 1 ఫోర్‌)తో కలిసి సఫారీ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆమ్లా (6) విఫలమయ్యాడు. కాట్రెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో గేల్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మార్క్‌రమ్‌ (5)ను కూడా కాట్రెలే ఔట్‌ చేశాడు.  కెప్టెన్‌ డుప్లెసిస్‌ (0 నాటౌట్‌) క్రీజులోకి వచ్చిన కాసేపటికే వర్షం కూడా వచ్చింది. మైదానాన్ని ముంచెత్తింది. దీంతో ఆటకు చాలా సేపు అంతరాయం ఏర్పడింది. చివరకు పిచ్, ఔట్‌ఫీల్డ్‌ మ్యాచ్‌ నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు పాల్‌ విల్సన్, రొడ్‌ టక్కర్‌లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లు ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. చిత్రంగా మూడు మ్యాచ్‌లాడినా పాయింట్లు గెలవలేకపోయిన దక్షిణాఫ్రికా ఖాతాలో ఎట్టకేలకు రద్దయిన మ్యాచ్‌తో ఓ పాయింట్‌ చేరింది.

ప్రపంచకప్‌లో నేడు
శ్రీలంక vs బంగ్లాదేశ్‌
మధ్యాహ్నం గం.3 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top