చెలరేగిన సొహైల్‌.. దక్షిణాఫ్రికా లక్ష్యం 309

Sohails whirlwind innings fires Pakistan to 308 - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బ్యాటింగ్‌లో మెరిసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 309 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. హరీస్‌ సొహైల్‌(89; 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు‌) చెలరేగగా, బాబర్‌ అజామ్‌(69), ఇమాముల్‌ హక్‌(44), ఫకార్‌ జమాన్‌(44)లు రాణించడంతో పాకిస్తాన్‌ మూడొందల పరుగుల మార్కును చేరింది. ఇన్నింగ్స్‌ను ఇమాముల్‌ హక్‌- ఫకార్‌ జమాన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగులు జత చేసిన తర్వాత ఫకార్‌ జమాన్‌(44; 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటయ్యాడు.  

సఫారీ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ వేసిన 15 ఓవర్‌ ఐదో బంతికి ఫకార్‌ జమాన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ఇమాముల్‌ హక్‌కు బాబర్‌ అజామ్‌ జత కలిశాడు. ఈ జోడి 17 పరుగులు జత చేసిన తర్వాత ఇమాముల్‌ హక్‌(44; 57 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై మహ్మద్‌ హఫీజ్‌(20) నిరాశపరిచాడు. కాగా, హరీస్‌ సొహైల్‌ మెరుపులు మెరిపించి పాక్‌ స్కోరును గాడిలో పెట్టాడు. బాబర్‌ అజామ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే అజామ్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.(ఇక్కడ చదవండి: ఇమ్రాన్‌ తాహీర్‌ ‘వరల్డ్‌కప్‌’ రికార్డు)

ఈ జోడి 81 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత అజామ్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ సమయంలో సోహైల్‌కు ఇమాద్‌ వసీం కలిశాడు. వీరిద్దరూ 71 పరుగుల జత చేసిన తర్వాత ఇమాద్‌(23) ఐదో వికెట్‌గా ఔట్‌ కాగా, కాసేపటికి వహాబ్‌ రియాజ్‌(4) పెవిలియన్‌ చేరాడు. మరో మూడు పరుగుల వ్యవధిలో సొహైల్‌ కూడా ఔట్‌ కావడంతో స్కోరు వేగం తగ్గింది.  దాంతో పాకిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఇదిలా ఉంచితే, పాక్‌ కెప్టెన్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఇక్కడ గమనార్హం. చివరి ఓవర్‌లో రెండు బంతులు ఆడిన సర్పరాజ్‌ రెండు పరుగులు మాత్రమే చేశాడు.  దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్‌ రెండు వికెట్లు తీశాడు. ఫెహ్లుక్వోయో, మర్కరమ్‌లకు తలో వికెట్‌ లభించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top