స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. లాహోర్ వేదికగా నిన్న (నవంబర్ 1) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో పాక్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగా.. పాక్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
చెలరేగిన షాహీన్
రీజా హెండ్రిక్స్ (34), కార్బిన్ బాష్ (30 నాటౌట్), డొనొవన్ ఫెరియెరా (29), డెవాల్డ్ బ్రెవిస్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో సౌతాఫ్రికా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. డికాక్, ప్రిటోరియస్. జార్జ్ లిండే డకౌట్లయ్యారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-26-3), ఫహీమ్ అష్రాఫ్ (4-0-28-2), సల్మాన్ మీర్జా (4-0-16-1), ఉస్మాన్ తారిఖ్ (4-0-26-2), మొహమ్మద్ నవాజ్ (3-0-38-1) చెలరేగిపోయారు.
రాణించిన బాబర్
చాలాకాలం తర్వాత బాబర్ ఆజమ్ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. సల్మాన్ అఘా (33) ఓ మోస్తరుతో పర్వాలేదనిపించాడు.
మిగతా బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ 19, సైమ్ అయూబ్ డకౌట్, ఉస్మాన్ ఖాన్ 6 (నాటౌట్), హసన్ నవాజ్ 5, మొహమ్మద్ నవాజ్ డకౌట్, ఫహీమ్ అష్రాఫ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్, లిజాడ్ విలియమ్స్ తలో 2, డొనొవన్ ఫెరియెరా, సైమ్‌లేన్ చెరో వికెట్ తీశారు.
చదవండి: బాబర్ ఆజం ప్రపంచ రికార్డు.. మొన్న రోహిత్.. ఇప్పుడు కోహ్లి రికార్డు బద్దలు


