పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం (Babar Azam) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20 (PAK vs SA 3rd T20I)లో ఈ వన్‌డౌన్ బ్యాటర్ అదరగొట్టాడు. ధనాధన్ దంచికొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మెరుపు హాఫ్ సెంచరీ
ఈ క్రమంలోనే బాబర్ ఆజం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మరో ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో వైఫల్యం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన బాబర్‌కు.. ఆ తర్వాత జట్టులోనూ స్థానం కరువైంది. అయితే, ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా అతడు పునరాగమనం చేశాడు.
కానీ రీఎంట్రీలో.. అంటే ప్రొటిస్‌తో తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అయితే, రెండో టీ20లో 11 పరుగులతో అజేయంగా నిలిచి ఫర్వాలేదనిపించిన అతడు.. మూడో టీ20లో మాత్రం మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.
139 పరుగులకు కట్టడి
లాహోర్ వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాక్.. సౌతాఫ్రికాను 139 పరుగులకు కట్టడి చేసింది. షాహిన్ ఆఫ్రిది మూడు వికెట్లు తీయగా.. ఫాహిమ్ ఆష్రఫ్ , ఉస్మాన్ తారిక్ రెండేసి వికెట్లు, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రొటిస్ బ్యాటర్లలో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 34 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. కార్బిన్ బాష్ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (19), సయీమ్ ఆయుబ్ (0) దారుణంగా విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన బాబర్ బాధ్యత తీసుకున్నాడు.
బాబర్‌కు తోడుగా కెప్టెన్ సల్మాన్ ఆఘా (26 బంతుల్లో 33) రాణించగా.. హసన్ నవాజ్ (5), నవాజ్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇక బాబర్ మొత్తంగా 47 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. ఆఖర్లో ఉస్మాన్ ఖాన్ 6, ఫాహిమ్ ఆష్రఫ్ 4 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు.
కోహ్లి ప్రపంచ రికార్డు బద్దలు
ఇక మూడో టీ20లో విజయంతో పాకిస్తాన్ సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తన ఫిఫ్లీ ప్లస్ స్కోర్ల సంఖ్యను నలభైకి పెంచుకున్నాడు.
తద్వారా ఇప్పటిదాకా అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ల వీరుడిగా ఉన్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా 11 పరుగులు చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న భారత దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను అధిగమించిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్లు
🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 40 (3 శతకాలు, 37 ఫిఫ్టీలు)
🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 39 (ఒక శతకం, 39 ఫిఫ్టీలు)
🏏రోహిత్ శర్మ (ఇండియా)- 37 (5 శతకాలు, 32 ఫిఫ్టీలు)
🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- 31 (ఒక శతకం, 30 ఫిఫ్టీలు)
🏏డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 29 (ఒక శతకం, 28 ఫిఫ్టీలు).
చదవండి: IND vs SA: వన్డే తరహా బ్యాటింగ్!.. పాపం పంత్.. భారత్‌కు షాక్


