సౌతాఫ్రికా- ‘ఎ’తో మ్యాచ్ భారత్- ‘ఎ’ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. వంద పరుగుల మార్కుకు పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. పంత్ ఐదో వికెట్‌గా వెనుదిరడంతో భారత జట్టు మరోసారి కష్టాల్లో పడింది. కాగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వేదికగా భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్ల గురువారం తొలి అనధికారిక టెస్టు ఆరంభమైంది.
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికా.. రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులకే చాప చుట్టేసింది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 234 పరుగులకే ఆలౌట్ కావడం సౌతాఫ్రికాకు కలిసి వచ్చింది.
భారత్‌కు 275 పరుగుల లక్ష్యం
మొదటి ఇన్నింగ్స్ కలుపుకొని భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే (6), వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (5) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (12) కూడా నిరాశపరిచాడు.
ఈ క్రమంలో... గాయం నుంచి కోలుకొని తిరిగి మైదానంలో అడుగు పెట్టిన భారత స్టార్ రిషబ్ పంత్ (81 బంతుల్లో 64 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా గాయపడిన పంత్ దాదాపు మూడు నెలల తర్వాత పోటీ క్రికెట్‌లో అడుగుపెట్టగా... తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులే చేశాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అదరగొట్టాడు.
వన్డే తరహా ఆటతీరుతో
కీలక దశలో క్రీజులోకి వచ్చిన పంత్... తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వన్డే తరహా ఆటతీరుతో సఫారీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఒక ఎండ్‌లో పాటీదార్ క్రీజులో పాతుకుపోయి వికెట్ల పతనాన్ని అడ్డుకుంటే... మరో ఎండ్‌లో పంత్ ఫటాఫట్ ఆటతీరుతో పరుగులు రాబట్టాడు. నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించిన అనంతరం రజత్ అవుటయ్యాడు. పంత్‌తో పాటు ఆయుశ్ బదోనీ (0 బ్యాటింగ్) క్రీజులో నిలిచాడు.
ఫలితంగా 275 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత ‘ఎ’ జట్టు మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆఖరిదైన ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 26 పరుగులు జత చేసిన పంత్ సెంచరీ దిశగా పయనించాడు.
సెంచరీ మిస్
అయితే, 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రొటిస్ బౌలర్ టియాన్ వాన్ వారెన్ అద్భుత బంతితో పంత్‌ను బోల్తా కొట్టించాడు. వారెన్ వేసిన బంతిని షాట్ ఆడే క్రమంలో లీసెగో సెనొక్‌వనేకు క్యాచ్ ఇచ్చి పంత్.. ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆయుశ్ బదోని 34 పరుగుల వద్ద వారెన్‌కు తన వికెట్ సమర్పించుకున్నాడు.
ఫలితంగా 53 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసిన భారత్.. విజయానికి ఇంకా 80 పరుగుల దూరంలో నిలిచింది. తనుశ్ కొటియాన్ (9), మానవ్ సుతార్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో పంత్.. 113 బంతులుఎదుర్కొని పదకొండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు.
Update: లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు: 216-7 (61)
తనుశ్ కొటియాన్ 23 పరుగులు చేసి ఏడో వికెట్‌గా వెనుదిరగగా.. మానవ్ సుతార్ 1, అన్షుల్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 59 పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో కేవలం కేవలం మూడు వికెట్లు (టెయిలెండర్లు) మాత్రమే ఉన్నాయి.
Match Result: IND vs SA: వారెవ్వా అన్షుల్!.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
చదవండి: ICC: గెలిచిన జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!.. బీసీసీఐ బంపరాఫర్!


