
ముంబై: ఓపెనర్ స్మృతి మంధాన (40 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన ఆటకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలవడంతో... తొలి అనధికారిక టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టుపై భారత మహిళల ‘ఎ’ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సాధికార విజయం సాధించింది. సోమవారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్... నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
హీథర్ గ్రాహం (43), స్టాలెన్‌బర్గ్ (39), మే మెక్‌గ్రాత్ (31) రాణించారు. ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్ (4), వికెట్ కీపర్ తానియా భాటియా (0) విఫలమైనా, మంధాన, కౌర్ మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించి లక్ష్యాన్ని తేలిక చేశారు. వీరు వెనుదిరిగాక వస్త్రాకర్ (21 నాటౌట్), దీప్తి శర్మ (11 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.