సచిన్‌ వంద సెంచరీలకు ఆరేళ్లు

Six Years For Sachin Hundred Centuries - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ఎవరికి సాధ్యం కాని రికార్డును క్రికెట్‌ గాడ్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సుసాధ్యం చేశాడు. ఎన్నో రోజుల నుంచి ఊరించిన వంద సెంచరీల ఫీట్‌ను సచిన్‌ ఇదే రోజు అందుకున్నాడు. అన్నీ ఫార్మట్లలో కలిపి అప్పటికే 99 సెంచరీలు సాధించిన సచిన్‌ 100వ సెంచరీకి చాలా సమయం తీసుకున్నాడు. దీంతో ఈ ఫీట్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. 

చివరకు ఆసియా కప్‌లో భాగంగా 2012 మార్చి16 న ఢాకాలోని షేర్‌ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ సెంచరీతో ప్రపంచ క్రికెట్‌లో తన పేరుతో మరో చెరగని రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌పై సచిన్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ వన్డేలో 49 సెంచరీలు, టెస్టులో 51 సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే.

కోహ్లి అధిగమించెనా!  
16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్‌ ప్రపంచ క్రికెట్‌లో భారత కీర్తిని దశదిశల చాటాడు. భారత్‌లో క్రికెట్‌ ఒక మతంలా మారడానికి సచిన్‌ ఆట కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సచిన్‌ని స్పూర్తిగా తీసుకొని ఎంతో మంది యువ క్రీడాకారులు తమ సత్తాను చాటుతున్నారు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ కోహ్లి కూడా మాస్టర్‌ స్పూర్తితోనే క్రికెట్‌లోకి అడుగెట్టాడు. వరుస సెంచరీలతో చెలరేగుతున్న కోహ్లి ఇప్పటికే అన్నిఫార్మట్లలో కలిపి 56 సెంచరీలు నమోదు చేశాడు. అయితే కోహ్లి ఫామ్‌ ఇలానే కొనసాగితే సచిన్‌ సాధించి ఈ అద్భుత రికార్డు అధిగమించడం కష్టమేమి కాదని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top