సిరిల్‌ వర్మకు సింగిల్స్‌ టైటిల్‌ | Siril Varma wins All India Senior Ranking Tournament | Sakshi
Sakshi News home page

సిరిల్‌ వర్మకు సింగిల్స్‌ టైటిల్‌

Jun 25 2018 10:12 AM | Updated on Jun 25 2018 10:12 AM

Siril Varma wins All India Senior Ranking Tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ కుర్రాడు సిరిల్‌ వర్మ సత్తా చాటాడు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అతను పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో ఎ. సిరిల్‌ వర్మ (తెలంగాణ) 18–21, 21–16, 21–8తో సౌరభ్‌ వర్మపై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో వెనుకబడిన సిరిల్‌ తర్వాతి రెండు గేముల్లో పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో తెలుగు అమ్మాయి సాయి ఉత్తేజిత రావు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఫైనల్లో పదహారో సీడ్‌ అష్మితా చలిహా (అస్సాం) 21–16, 14–21, 21–15తో మూడో సీడ్‌ ఉత్తేజిత (ఆంధ్రప్రదేశ్‌)కు షాకిచ్చింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో కృష్ణ ప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌)– ధ్రువ్‌ కపిల (ఎయిరిండియా) ద్వయం 24–22, 21–13తో అరుణ్‌ జార్జి (కేరళ)–సన్యం శుక్లా (ఎయిరిండియా) జోడీపై నెగ్గి టైటిల్‌ను గెలుచుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కె. నందగోపాల్‌ (కాగ్‌)–సంజన (ఎయిరిండియా) జంట 21–16, 13–21, 21–17తో ధ్రువ్‌ కపిల–మేఘన జక్కంపూడి (ఆర్‌బీఐ) జోడీపై విజయం సాధించింది. మహిళల డబుల్స్‌ విభాగంలో అపర్ణ బాలన్‌ జంట చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మూడో సీడ్‌ అపర్ణ బాలన్‌– శ్రుతి జోడీ 19–21, 21–19, 21–18తో సంయోగిత (ఎయిరిండియా)–ప్రజక్తా సావంత్‌ జంటను ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహు మతి ప్రదాన కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్‌ సంఘం కార్యదర్శి అజయ్‌ సింఘానియా, ఒమర్‌ రషీద్, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement