
సిడ్నీ: త్వరలో టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభం కానున్న నాలుగు టెస్టుల సిరీస్‌పై ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ స్పందించాడు. ఆస్ట్రేలియాలో మొట్టమొదటి టెస్టు సిరీస్ గెలవడానికి టీమిండియాకు ఈసారి ఎక్కువ అవకాశాలున్నాయని వాట్సన్ జోస్యం చెప్పాడు. కానీ సొంత గడ్డపై ఆసీస్‌ను ఓడించడం భారత్‌కు పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు. ‘ ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడానికి టీమిండియా మంచి అవకాశాలున్నాయి.
ఈ సిరీస్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత క్రికెట్ జట్టు చాలా బలంగా ఉంది. ప్రధానంగా వైవిధ్యమైన భారత్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఆసీస్ కష్టపడాల్సి ఉంటుంది. కాకపోతే సొంతగడ్డపై ఆసీస్ ఎప్పుడూ ప్రమాదకారే. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఆసీస్‌కు ఎక్కువగా ఉంటుందింది. ఇప్పటివరకూ స్వదేశంలో ఆసీస్ చాలా తక్కువసార్లు మాత్రమే ఓడిపోయింది. ఈసారి టీమిండియా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ, హోరాహోరీ పోరు తప్పదు’ అని వాట్సన్ పేర్కొన్నాడు. డిసెంబర్ 6వ తేదీన ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది.