కోహ్లి, రోహిత్‌ రికార్డును బ్రేక్‌ చేయడమే టార్గెట్‌!

Shai Hopeful Of Pipping Kohli, Rohit Sharma - Sakshi

ఐపీఎల్‌ వేలం అనేది నాకు సెకండరీ: షాయ్‌ హోప్‌

విశాఖపట్నం: వచ్చే సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా డిసెంబర్‌ 19(గురువారం)వ తేదీన కోల్‌కతాలో వేలం జరుగనున్న తరుణంలో వందల సంఖ్యలో క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. అయితే తనకు ఐపీఎల్‌ వేలం బెంగ లేదంటున్నాడు వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ షాయ్‌ హోప్‌. తమ జట్టులో చాలా మంది క్రికెటర్లకు ఐపీఎల్‌ వేలం అనేది మైండ్‌లో ఉంటుందేమో కానీ, తనకు మాత్రం అది సెకండరీ అని స్పష్టం చేశాడు. ఐపీఎల్‌ వేలం కోసం తానేమీ నిద్రలేని రాత్రులు గడపడం లేదంటూ చమత్కరించాడు. అదే సమయంలో ఒక రికార్డుపై మాత్రం ఫోకస్‌ చేసినట్లు సూచనప్రాయంగా హోప్‌ చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగుల జాబితాలో కోహ్లి(1292), రోహిత్‌ శర్మ(1268)లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, హోప్‌(1225) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దాంతో కోహ్లి, రోహిత్‌ల రికార్డులపై కన్నేసినట్లు ముసిముసిగా నవ్వుతూ పేర్కొన్నాడు.  తనకు ఎదురైన ప్రశ్నకు సంబంధించి హోప్‌ ఇలా పేర్కొన్నాడు. ‘కచ్చితంగా ఐపీఎల్‌ వేలానికి సంబంధించిన టెన్షన్‌ చాలా మందికి ఉంటుంది. కానీ నాకైతే లేదు. నాకు భారత్‌తో సిరీసే ముఖ్యమైనది. ఇక్కడ పరుగులు చేయడమే నా ముందున్న  టార్గెట్‌. ఈ క్రమంలోనే కోహ్లి, రోహిత్‌ల రికార్డులను కూడా బ్రేక్‌ చేయాలని ఉంది.

వారి రికార్డును బ్రేక్‌ చేయాలంటే వారిద్దర్నీ తొందరగా పెవిలియన్‌కు పంపమని మా బౌలర్లను అడగాలి(నవ్వుతూ).  ఆ ఇద్దర్నీ సాధ్యమైనంత త్వరగా ఔట్‌ చేస్తే ఇక నేను రేసులోకి వస్తా. ఒకవేళ నేను పరుగులు సాధిస్తే టాప్‌లోకి వస్తా.  నేను 50 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండాలని అనుకోను. ఒకవేళ  నేను 50 యాభై ఓవర్లు ఆడేస్తే మా ప్లేయర్లకు మరో 50 ఓవర్లు కావాలి కదా. నేను సాధారణంగా భారీ  స్కోరు సాధించడంపైనే దృష్టి పెడతా. ఒక బ్యాట్స్‌మన్‌గా దేశం కోసం ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యతిస్తా’ అని హోప్‌ పేర్కొన్నాడు.  భారత్‌తో జరిగిన తొలి వన్డేలో హోప్‌ సెంచరీ సాధించి విండీస్‌ విజయానికి సహకరించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top