గంభీర్‌ ఓ ఇడియట్‌ : పాక్‌ క్రికెటర్‌

Shahid Afridi Calls Gautam Gambhir Bewakoof - Sakshi

ఇస్లామాబాద్‌ : టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌పై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది మరోసారి నోరుపారెసుకున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరు వెటరన్‌ ఆటగాళ్లు పలుమార్లు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిపై ఘాటుగా స్పందించిన గంభీర్‌ పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ప్రపంచకప్‌లో కూడా ఆ జట్టుతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలన్నారు. మహా అయితే భారత్‌ రెండు పాయింట్లు కోల్పోతుందని, ఆట కన్నా దేశ ప్రజల సెంటిమెంట్‌ ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఈ విషయంపై తీవ్ర చర్చ కూడా జరిగింది. మాజీ ఆటగాళ్లు, అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. బీసీసీఐ కూడా పాక్‌తో మ్యాచ్‌ విషయంలో కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేసింది.

తాజాగా, ఇదే విషయమై షాహిద్ అఫ్రిది స్పందించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న గంభీర్ వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమన్నాడు. గంభీర్ లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? అని ప్రశ్నించాడు. ప్రజలకు ఇలాగానే చెప్పేది? అని నిలదీశాడు. గంభీర్‌ ఒక బేవకూఫ్‌( ఇడియట్‌) అంటూ ఘాటుగా విమర్శించాడు. అతన్ని ఇటీవల ఎన్నికల్లో ఎన్నుకున్న ప్రజలనుద్దేశించి కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. పుల్వామా ఉగ్రదాడి ఆమోదయోగ్యం కాదని, కానీ దానికి ముడిపెడుతూ మ్యాచ్‌ను బహిష్కరించాలని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదని, ఇకపై ఆసియాకప్‌లోనూ రెండు జట్లు తలపడకపోవడం మంచిదేమోనని అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండగా. ఈ వ్యాఖ్యలపై గంభీర్‌ ఎలా స్పందిస్తాడోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక అఫ్రిది తన ఆత్మకథ ‘గేమ్ చేంజర్’లోనూ గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గంభీర్‌కు పొగరు తప్ప చెప్పుకోదగ్గ రికార్డులేమీ లేవని ఆ బుక్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా తన మత విశ్వాసాల కారణంగా తన కూతుళ్లను ఔట్‌డోర్‌ గేమ్స్‌ ఆడనివ్వనని ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు. ఇక గంభీర్‌ తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 30న మెగా టోర్నీ ప్రపంచకప్‌కు తెర లేవనుండగా.. వచ్చే నెల 16న భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top