Gambhir- Afridi: గంభీర్‌ దగ్గరికి వచ్చి ఆఫ్రిది ఆరా.. వీడియో వైరల్‌! ఫ్యాన్స్‌ ఏమన్నారంటే!

LLC 2023: Gautam Gambhir Gets Hit On Helmet Shahid Afridi Gesture Video Goes Viral - Sakshi

Legends League Cricket 2023: లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌- 2023లో భాగంగా ఇండియా మహరాజాస్‌- ఆసియా లయన్స్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇండియా కెప్టెన్‌ గౌతం గంభీర్‌ పట్ల లయన్స్‌ సారథి షాహిద్‌ ఆఫ్రిది వ్యవహరించి తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దోహా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసియా లయన్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. మిస్బా ఉల్‌ హక్‌ అద్భుత అర్ధ శతకం(73)కి తోడు ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ 40 పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్రిది బృందం 6 వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఇండియా మహరాజాస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ రాబిన్‌ ఊతప్ప డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్‌, కెప్టెన్‌ గౌతం గంభీర్‌ అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

39 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. కాగా గంభీర్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో హెల్మెట్‌కు బంతి తాకింది. ఇండియా ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో అబ్దుల్‌ వేసిన బంతిని ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండరీకి తరలించేందుకు గౌతీ ప్రయత్నించాడు. అయితే, బాల్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి తర్వాత హెల్మెట్‌కు తగిలింది. 

అయితే, బంతి మరీ అంత బలంగా తాకకపోవడంతో గౌతీ- మహ్మద్‌ కైఫ్‌ పరుగు పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో గౌతీ దగ్గరికి వెళ్లిన ఆఫ్రిది.. బాల్‌ హెల్మెట్‌కు తాకిన విషయం గురించి ఆరా తీశాడు. సమస్య ఏమీ లేదు కదా! అన్నట్లు గౌతీతో వ్యాఖ్యానించగా.. అదేమీ లేదని అతడు బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్‌ పాకిస్తాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది.

అయితే, బిగ్‌ హార్ట్‌ అంటూ ఆఫ్రిదిని పొగుడుతూ క్యాప్షన్‌ జతచేయడం పట్ల గంభీర్‌ ఫ్యాన్స్‌ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఓ ఆటగాడిగా క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడు.. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు కదా!’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మైదానం లోపల, వెలుపలా గంభీర్‌- ఆఫ్రిది మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో క్రికెట్‌ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందుకే ఈ వీడియో నెట్టింట ఇలా చక్కర్లు కొడుతోంది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. గంభీర్‌ తర్వాత వన్‌డౌన్‌ బ్యాటర్‌ మురళీ విజయ్‌ 25, మహ్మద్‌ కైఫ్‌ 22 పరుగులతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 9 పరుగుల తేడాతో ఆసియా లయన్స్‌ ఇండియా మహరాజాస్‌పై విజయం సాధించింది.

చదవండి: Rohit Sharma: రోహిత్‌ అరుదైన రికార్డు.. సచిన్‌, కోహ్లితో పాటు ఆ జాబితాలో! అజారుద్దీన్‌ తర్వాత..
NZ Vs SL: డ్రా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top