కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జంట

Satwik And Chirag Shetty in Career Best Rank - Sakshi

తొమ్మిదో స్థానానికి ఎగబాకిన భారత నంబర్‌వన్‌ జోడీ  

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో సంచలన ప్రదర్శనతో డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన తెలుగుతేజం రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ కెరీర్‌ బెస్టు ర్యాంక్‌కు ఎగబాకింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ షెట్టి ద్వయం ఏడు స్థానాలు పురోగతి సాధించి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. గతవారం థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా... ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా సాత్విక్‌ జంట చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మరో భారత ద్వయం మను అత్రి–సుమీత్‌ రెడ్డి నిలకడగా 25వ స్థానంలోనే కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో పెద్దగా మార్పులేవీ జరగలేదు. కిడాంబి శ్రీకాంత్‌ 10, సమీర్‌ వర్మ 13, భమిడిపాటి సాయిప్రణీత్‌ 19, ప్రణయ్‌ 31, సౌరభ్‌ వర్మ 44వ ర్యాంక్‌ల్లోనే ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 5వ, సైనా నెహ్వాల్‌ 8వ ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ ఒక ర్యాంక్‌ను మెరుగుపర్చుకొని 23వ ర్యాంక్‌కు చేరింది. మిక్స్‌డ్‌లో సిక్కి రెడ్డి– ప్రణవ్‌ చోప్రా జంట ఒక స్థానాన్ని కోల్పోయి 23వ ర్యాంక్‌లో నిలువగా, అశ్విని–సాత్విక్‌ జోడీ నాలుగు స్థానాల్ని కోల్పోయి 27వ ర్యాంక్‌కు పడిపోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top