ముగిసిన భారత్‌ పోరు | Tarun loses in the pre quarters of the Thailand Open badminton tournament | Sakshi
Sakshi News home page

ముగిసిన భారత్‌ పోరు

May 16 2025 3:27 AM | Updated on May 16 2025 3:27 AM

Tarun loses in the pre quarters of the Thailand Open badminton tournament

ప్రిక్వార్టర్స్‌లో ఓడిన తరుణ్‌

ఉన్నతి, మాళవిక, ఆకర్షి కూడా  

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో తరుణ్‌ మన్నేపల్లి... మహిళల సింగిల్స్‌ విభాగంలో ఉన్నతి హుడా, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్‌... మహిళల డబుల్స్‌ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ను దాటలేకపోయారు. క్వాలిఫయర్‌ హోదాలో మెయిన్‌ డ్రాలో అడుగు పెట్టిన తరుణ్‌ గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 14–21, 16–21తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు. 

42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తరుణ్‌ రెండో గేమ్‌లో కాస్త పోటీనిచ్చాడు. మహిళలసింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఉన్నతి హుడా 14–21, 11–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, మాళవిక 12–21, 16–21తో ప్రపంచ మాజీ చాంపియన్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, ఆకర్షి కశ్యప్‌ 9–21, 14–21తో సుపనిద కటెథోంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమి చవిచూశారు. 

మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 20–22, 14–21తో రుయ్‌ హిరోకామి–సయాకా హొబారా (జపాన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) టూర్‌ టోర్నీలలో భారత్‌ నుంచి ఒక్కరు కూడా ఫైనల్‌ చేరుకోలేకపోయారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement