‘ఇక ధోనిపై అంచనాలు తగ్గించుకోండి’

Sanjay Manjrekar wants fans to expect less from MS Dhoni - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై అభిమానులు అంచనాలు తగ్గించుకోవాలని క్రికెట్‌ విశ్లేషకుడు, మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ స్థాయిలో పోటీ ఇవ్వలేకపోతున్నాడని తెలిపిన మంజ్రేకర్‌.. అతనికి మ్యాచ్‌లను ఘనంగా ముగించే సత్తా కూడా సన్నగిల్లిందన్నాడు. అయితే వచ్చే వరల్డ్‌కప్‌ వరకూ అతన్నే కొనసాగించాలని, కాకపోతే ధోనికి ప్రత్యామ్నాయంగా మరొకరిని సిద్ధం చేయాలన్నాడు.

‘ఆసియాకప్‌ ఫైనల్లో ధోని మరింత కింద స్థానంలో వచ్చి ఉండే బాగుండేది.  ధోని కన్నా ముందు కేదార్‌ జాదవ్‌ రావాల్సింది. అతడు ఫామ్‌లో ఉన్నాడు. పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌. ఇక ధోనిపై అభిమానులు అంచనాలు తగ్గించుకోవాలి. అతనో అద్భుత వికెట్‌ కీపర్‌. వేగంగా స్టంపింగ్‌ చేస్తాడు. అతనిలాంటి అనుభవం ఉన్న వ్యక్తి విరాట్‌ కోహ్లీకి అవసరం. అతడి బ్యాటింగ్‌ మాత్రం సమస్యగా మారింది’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.

మరొకవైపు ఇంగ్లండ్‌ పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోవడంపై మంజ్రేకర్‌ మరొకసారి పెదవి విరిచాడు. అసలు ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్‌లో అమోఘంగా ఉంటే, ఇంగ్లండ్‌ పిచ్‌లపై మాత్రం కనీసం పోరాటం ఇవ్వలేకపోయిందన్నాడు. ఇక్కడ బౌలింగ్‌ విభాగంలో టీమిండియా ఆకట్టుకుంటే, అందుకు భిన్నంగా మన బ్యాటింగ్‌ సాగిందన్నాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో చతికిలబడటానికి పేలవమైన బ్యాటింగ్‌ టెక్నికే కారణమన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top