ఫెరారీ డ్రైవర్‌గా సెయింజ్‌ 

Sainz As A Ferrari Driver For 2021 - Sakshi

పారిస్‌: ఫెరారీ జట్టులో స్టార్‌ రేసర్‌గా వెలుగొందిన సెబాస్టియన్‌ వెటెల్‌ (జర్మనీ) స్థానాన్ని కార్లోస్‌ సెయింజ్‌ (జూనియర్‌)తో భర్తీ చేశారు. ఈ మేరకు అతనితో రెండేళ్లపాటు ఒప్పందం చేసుకున్నట్లు ఫార్ములావన్‌ టీమ్‌ ఫెరారీ వెల్లడించింది. నాలుగు సార్లు ఫార్ములావన్‌ చాంపియన్‌ అయిన జర్మనీ డ్రైవర్‌ వెటెల్‌ ఫెరారీని వీడనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అతని స్థానంలో పలువురి పేర్లు వినిపించినా... చివరకు సెయింజ్‌కు ఆ చాన్స్‌ దక్కింది. 2021, 2022 ఫార్ములావన్‌ రెండు సీజన్లలో సెయింజ్‌ ఫెరారీ స్టీరింగ్‌ చేపట్టనున్నాడు. ప్రస్తుతం మెక్‌లారెన్‌తో ఉన్న సెయింజ్‌ కాంట్రాక్ట్‌ ఈ ఏడాదితో ముగియనుంది.  2015లో టోరో రోసోతో తన ఫార్ములా కెరీర్‌ను ఆరంభించిన సెయింజ్‌... అనంతరం రీనాల్ట్, మెక్‌లారెన్‌ జట్లకు డ్రైవర్‌గా వ్యవహరించాడు.

‘సెయింజ్‌ ప్రతిభ గల డ్రైవర్‌... గత ఐదు సీజన్‌లలో అతడు తనను తాను నిరూపించుకున్నాడు. అతడికి ఫెరారీ స్వాగతం పలుకుతోంది’ అని ఫెరారీ జట్టు చీఫ్‌ మాటియో బినోటో తెలిపారు. ఫెరారీతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని.. అయితే ప్రస్తుతం ఈ సీజన్‌లో మెక్‌లారెన్‌ తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చి వారికి ఘనమైన వీడ్కోలు పలకడమే తన ముందున్న లక్ష్యం అని సెయింజ్‌ పేర్కొన్నాడు. సెయింజ్‌ వెళ్లిపోవడంతో అతని స్థానాన్ని రికియార్డో (ఆస్ట్రేలియా)తో భర్తీచేసుకున్నట్లు మెక్‌లారెన్‌ జట్టు వెల్లడించింది. కరోనాతో నిలిచిపోయిన 2020  సీజన్‌ ఈ జూలైలో ఆరంభమయ్యే అవకాశం ఉంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top