అయ్యో...రోహిత్‌

Rohit Sharma Out For 0 In India Board President XI  - Sakshi

‘ఓపెనింగ్‌’లో హిట్‌మ్యాన్‌ డకౌట్‌ ∙ చెలరేగి ఆడిన కోన శ్రీకర్‌ భరత్‌

పాంచల్, సిద్దేశ్‌ అర్ధ సెంచరీలు

దక్షిణాఫ్రికాతో బోర్డు ఎలెవెన్‌ సన్నాహక మ్యాచ్‌ డ్రా  

టీమిండియా టెస్టు జట్టులో సుస్థిర స్థానం ఆశిస్తూ... ఓపెనర్‌గా భారీ ప్రయోగానికి సిద్ధపడిన రోహిత్‌ శర్మకు తీవ్ర నిరాశ...! అందరి కళ్లూ తనపై ఉండగా... దాదాపు రోజంతా ఆడే అవకాశం ఉన్న స్థితిలో...  క్రీజులోకి వచి్చన ఈ హిట్‌మ్యాన్‌... కేవలం రెండంటే రెండే బంతుల్లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఏ బలహీనత అయితే టెస్టు ఫార్మాట్‌కు తనను దూరం చేస్తోందో... దానికే మరోసారి అతడు వికెట్‌ పారేసుకున్నాడు.

పరిస్థితుల రీత్యా... దక్షిణాఫ్రికాతో సన్నాహక మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవెన్‌ మిగతా బ్యాట్స్‌మెన్‌ ప్రదర్శన కంటే రోహిత్‌ వైఫల్యమే ఎక్కువ చర్చనీయాంశమైంది. ఇప్పటికే టీమిండియా తలుపు తడుతోన్న ఆంధ్ర వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కోన శ్రీకర్‌ భరత్‌ అద్భుత బ్యాటింగ్‌తో మరోసారి సెలక్టర్ల దృష్టిలో పడటం విశేషం.  

సాక్షి ప్రతినిధి విజయనగరం: ముందున్న ఓపెనింగ్‌ పరీక్షను ఎదుర్కొనడానికి, టెస్టు శైలి బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సన్నాహక మ్యాచ్‌ రూపంలో దొరికిన అవకాశాన్ని రోహిత్‌ శర్మ (0) చేజార్చుకున్నాడు. దక్షిణాఫ్రికాతో శనివారం ఇక్కడ డ్రాగా ముగిసిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవెన్‌ కెప్టెన్‌ హోదాలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్‌... ఫిలాండర్‌ బౌలింగ్‌లో సున్నాకే ఔటయ్యాడు. సంప్రదాయ ఫార్మాట్‌లో స్వింగ్‌ అయ్యే ఎరుపు బంతిని ఆడలేడన్న విమర్శకు తగ్గట్లే అతడు వికెట్‌ ఇచ్చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌ యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రీకర్‌ భరత్‌ (57 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)లోని దూకుడైన ఆటను మళ్లీ చాటింది. ప్రియాంక్‌ పాంచల్‌ (77 బంతుల్లో 60; 10 ఫోర్లు, సిక్స్‌); సిద్దేశ్‌ లాడ్‌ (89 బంతుల్లో 52 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌)లకు ఫామ్‌ను ప్రదర్శించే వీలు కలి్పంచింది. 64 ఓవర్ల ఆట అనంతరం బోర్డు జట్టు స్కోరు 265/8 వద్ద ఉండగా మ్యాచ్‌ను ‘డ్రా’గా ప్రకటించారు.  

నిలిచిన బవుమా; ఫిలాండర్‌ దూకుడు
ఓవర్‌నైట్‌ స్కోరు 199/5తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా శనివారం మరో 14 ఓవర్లు ఆడి 80 పరుగులు జోడించి 279/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ టెంబా బవుమా (127 బంతుల్లో 87 నాటౌట్‌; 14 ఫోర్లు, సిక్స్‌) నిలకడ చూపగా ఫిలాండర్‌ (49 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్‌) ధాటిగా ఆడాడు. ధర్మేంద్ర జడేజా (3/66) బౌలింగ్‌లో అతడు ఔటయ్యాక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

భరతం పట్టాడు
భారీ స్కోరు చేయకున్నా... బోర్డు ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (92 బంతుల్లో 39; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. రోహిత్‌ ఔటయ్యాక వన్‌డౌన్‌లో వచి్చన అభిమన్యు ఈశ్వరన్‌ (13)ను రబడ బలిగొన్నాడు. మయాంక్, పాంచల్‌ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. మయాంక్, కరుణ్‌ నాయర్‌ (19)లను కేశవ్‌ మహరాజ్‌ (3/35) పాంచల్‌ను ఫిలాండర్‌ (2/27) వరుసగా ఔట్‌ చేయడంతో జట్టు 136/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో లాడ్, భరత్‌ 100 పరుగులు జోడించి ఆదుకున్నారు. ముఖ్యంగా భరత్‌ టి20 తరహాలో చెలరేగి ఆడాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ డేన్‌ పీట్‌ (1/80)ను లక్ష్యంగా చేసుకుని సిక్స్‌లతో ప్రతాపం చూపాడు. సెంచరీ ఖాయంగా కనిపించిన అతడి దూకుడుకు కేశవ్‌ తెరదించాడు. జలజ్‌ సక్సేనా (2), ధర్మేంద్ర జడేజా (0) ఔటయ్యాక ఆట ముగిసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top