పతకం ముంగిట... | Rio Olympics 2016 Live Day 8: Sania Mirza-Rohan win first set in semis | Sakshi
Sakshi News home page

పతకం ముంగిట...

Aug 14 2016 2:34 AM | Updated on Sep 4 2017 9:08 AM

పతకం ముంగిట...

పతకం ముంగిట...

కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భారత అభిమానుల నిరీక్షణకు తెరపడేలా కనిపిస్తోంది. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడి సానియా మీర్జా-రోహన్ బోపన్న

మరో విజయం సాధిస్తే సానియా-బోపన్న జంటకు పతకం
 మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో భారత జోడీ

 కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భారత అభిమానుల నిరీక్షణకు తెరపడేలా   కనిపిస్తోంది. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడి సానియా మీర్జా-రోహన్ బోపన్న సెమీస్‌కు చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. సెమీస్‌లో గెలిస్తే స్వర్ణం లేదా రజతం దక్కుతుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడిపోయినా... కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. మీరు ఈ వార్త చదివే సమయానికి మనవాళ్లు ఫైనల్‌కు చేరి కనీసం స్వర్ణం లేదా రజతం ఖాయం చేసినా ఆశ్చర్యపోకండి!
 
 రియో డి జనీరో: అంతా అనుకున్నట్లు జరిగితే రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల బోణీ చేయనుంది. టెన్నిస్ ఈవెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-రోహన్ బోపన్న ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పతకానికి కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-బోపన్న జంట 6-4, 6-4తో ఆండీ ముర్రే-హితెర్ వాట్సన్ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. సెమీఫైనల్లో వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) జంటతో సానియా-బోపన్న తలపడతారు.
 
  ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జంట ఫైనల్‌కు చేరుకుంటుంది. తద్వారా రజతం లేదా స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా సానియా-బోపన్నలకు కాంస్య పతక అవకాశాలు సజీవంగా ఉంటాయి. మిక్స్‌డ్ డబుల్స్ రెండో సెమీస్‌లో ఓడిన జోడీతో (బెథానీ మాటెక్ సాండ్స్-జాక్ సోక్ లేదా రాడెక్ స్టెపానెక్-లూసీ హర్డెకా) సానియా-బోపన్న ఆడాల్సి ఉంటుంది.
 
 డబుల్స్‌లో అంతగా అనుభవం లేని ఆండీ ముర్రే-హితెర్ వాట్సన్‌లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-బోపన్న పూర్తి సమన్వయంతో ఆడారు. నెట్ వద్ద అప్రమత్తంగా ఉంటూ, పదునైన రిటర్న్‌లతో ఆధిపత్యం కనబరిచారు. ఏడో గేమ్‌లో హితెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట ఎనిమిదో గేమ్‌లో తమ సర్వీస్‌నూ కాపాడుకొని 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను నిలబెట్టుకున్నా... పదో గేమ్‌లో బోపన్న ఏస్‌లతో అలరించి సెట్‌ను అందించాడు.
 
  రెండో సెట్‌లో ఐదో గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట ఆ తర్వాత 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని రెండో సెట్‌నూ 6-4తో దక్కించుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. 67 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సానియా-బోపన్న జంట ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement