పుష్కరకాల తపస్సు ఫలితం - సాక్షి మలిక్ | result of penance - sakshi Malik | Sakshi
Sakshi News home page

పుష్కరకాల తపస్సు ఫలితం - సాక్షి మలిక్

Aug 19 2016 2:09 AM | Updated on Sep 4 2017 9:50 AM

పుష్కరకాల తపస్సు ఫలితం  - సాక్షి మలిక్

పుష్కరకాల తపస్సు ఫలితం - సాక్షి మలిక్

చాలా సంతోషంగా ఉంది. 12 ఏళ్ల నా తపస్సు నేడు ఫలితాన్నిచ్చింది.

సాక్షి మలిక్ ఇంటర్వ్యూ

విజయంపై మీ స్పందన ఏంటి?
చాలా సంతోషంగా ఉంది. 12 ఏళ్ల నా తపస్సు నేడు ఫలితాన్నిచ్చింది. పగలు, రాత్రి కన్న నా కల నెరవేరింది. లండన్ ఒలింపిక్స్‌లో నా సీనియర్ గీత అక్క పాల్గొనడం నాలో స్ఫూర్తి పెంచింది. రెజ్లింగ్‌లో భారత్ తరపున ఒలింపిక్స్‌లో పతకం గెలిచే తొలి మహిళగా నిలుస్తానని అస్సలు అనుకోలేదు. కానీ ఇందుకోసం చాలా కష్టపడ్డాను. రియో బరిలో ఉన్న మిగిలిన భారత రెజ్లర్లు కూడా రాణిస్తారని ఆశిస్తున్నాను.

 
చివరి బౌట్‌లో ఆత్మరక్షణతో ఆడటం వల్లే వెనకపడ్డారా?

నిజమే, ఆ సమయంలో కాస్త ఒత్తిడికి లోనయ్యాను. అయితే చివరి క్షణం వరకు పోరాడాలనే నిశ్చయించుకున్నాను. అయితే, బౌట్‌లో ఆరు నిమిషాల వరకు మిగిలుంటే గెలుస్తానని నాకు తెలుసు. అలా మిగలాలి అంటే.. చివరి రౌండ్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాల్సిన పరిస్థితి. కానీ అప్పటికీ గెలుస్తాననే నమ్మకం నాకుంది.

 

ఓడిపోయాక రెప్‌చేజ్ కోసం ఎదురు చూసే సమయంలో ఒత్తిడికి లోనయ్యారా?
అవును, క్వార్టర్స్‌లో రష్యన్ రెజ్లర్ వలేరియా కోబ్లోవా చేతిలో ఓడిపోవటంతో చాలా బాధనిపించింది. అయితే చిన్న చిన్న పొరపాట్లు చేయకపోయుంటే.. నేను ఆ బౌట్లో గెలిచుండేదాన్ని. ఆ తర్వాత రెప్‌చేజ్ అవకాశం కోసం వేచి ఉన్న రెండున్నర గంటలు.. మరొక్క అవకాశం వస్తుందా? రాదా? అని ఒత్తిడికి గురయ్యాను

 
ఆ రెండున్నర గంటలు ఎలా గడిచాయి?

నిజానికి రెండున్నర గంటలపాటు నాకు విశ్రాంతి. కానీ రెప్‌చేజ్ విషయంలో ఒత్తిడితో ఉన్నప్పుడు.. నా కోచ్‌లు కుల్‌దీప్ మాలిక్, కుల్‌దీప్ సింగ్ నాలో స్ఫూర్తిని రగిలించారు. 

 
సుశీల్, యోగేశ్వర్ సరసన స్థానం లభించటం..?

ఈ పతకం నేను అందుకోవటం వెనక వారిద్దరి (సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్) ప్రభావం చాలా ఉంది. లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సుశీల్ కుమార్ నాకు స్ఫూర్తి. ఇప్పుడు వారి సరసన నిలుస్తున్నందుకు నా సంతోషాన్ని వర్ణించలేకపోతున్నాను.


పతకం ఎవరికి అంకితమిస్తారు?
ప్రతి అడుగులో నన్ను ప్రోత్సహించిన వారందరికీ అంకితం. నా తల్లిదండ్రులు, కోచ్‌లు, మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ కృతజ్ఞతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement