భారత హాకీకి వందేళ్లు.. | Indian Hockey to celebrate its glorious 100 years | Sakshi
Sakshi News home page

భారత హాకీకి వందేళ్లు..

Nov 7 2025 11:53 AM | Updated on Nov 7 2025 12:03 PM

Indian Hockey to celebrate its glorious 100 years

ప్రపంచ హాకీ చరిత్ర(World Hockey History)లో భారత్‌ది ప్రత్యేక స్దానం. విశ్వక్రీడల్లో ప్రపంచాన్ని 28 ఏళ్ల పాటు శాసించిన ఘనత మన హాకీది. సాక్ష్యాత్తూ నియంత హిట్లర్‌ను కూడా తమ ఆటతో మంత్రముగ్దున్ని చేసిన కళాత్మకమైన ఆట భారత హాకీ సొంతం. 

మేజర్ ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్ సీనియర్, ధన్రాజ్ పిళ్ళై వంటి దిగ్గజ క్రీడాకారులను ప్రపంచానికి పరిచియం చేసింది ఈ క్రీడనే. ప్రస్తుతం భారత్‌లో క్రికెట్‌ హవా కొనసాగుతున్నప్పటికి.. ఇప్పటికీ హాకీ ఆటపై క్రీడాభిమానుల్లో ఎంతో అభిమానం ఉంది. విశ్వవేదికలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడించిన భారత హాకీ జట్టు అంతర్జాతీయ హాకీ (1925-2025)లో అడుగుపెట్టి నేటికి వందేళ్లు పూర్తయింది.

మన హాకీ పుట్టింది ఇలా..
1850లో ఆంగ్లేయులు భారత్‌కు హాకీని పరిచయం చేశారు. అయితే దాదాపు 75 ఏళ్ల తర్వాత భారత హాకీకి ఓ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం కొంతమంది వ్యక్తులు గ్వాలియర్‌లో సమావేశమయ్యారు. దీంతో 1925 నవంబర్ 7న గ్వాలియర్‌లో ఇండియన్ హాకీ ఫెడరేషన్ (IHF) అధికారికంగా ఏర్పాటైంది. 

అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH)లో సభ్యత్వం పొందిన తొలి ఐరోపా దేశం కాని జట్టుగా భారత్ నిలిచింది.  ఇండియన్‌ హాకీ ఫెడరేషన్ ఏర్పడిన తర్వాత మన జట్టు సత్తా ఎంటో ప్రపంచానికి తెలిసింది. 1926లో తొలిసారి న్యూజిలాండ్‌ టూర్‌కు వెళ్లిన ఇండియన్‌ టీమ్‌ మొత్తం 21 మ్యాచ్‌లు ఆడగా.. 18 గెలిచింది. ఈ టూర్‌లోనే  హాకీ మాంత్రికుడిగా పేరు గాంచిన ధ్యాన్‌చంద్ ప్రపంచానికి పరిచయమయ్యాడు.

సువర్ణ యుగం..
ఆ తర్వాత 1928లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత హాక్‌ జట్టు అద్భుతం చేసింది. తొలి ఒలింపిక్స్‌లోనే స్వర్ణ పతకం సాధించి మన హాకీ జట్టు అందరిని షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాత 1928 నుండి 1956 వరకు  ఒలింపిక్స్‌లో వరుసగా ఆరు స్వర్ణ పతకాలను సాధించిన భారత హాకీ జట్టు.. హాకీ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా వెలుగొందింది.

ఇప్పటివరకు ఇండియన్‌ హాకీ జట్టు మొత్తం 8 ఒలింపిక్ స్వర్ణాలు, ఒక​ రజతం, 4 కాంస్య పతకాలను గెలుచుకుంది. అదేవిధంగా  1975లో భారత జట్టు తొలిసారిగా హాకీ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అయితే ఆ తర్వాత భారత హాకీ తన ఉనికిని కోల్పోయింది. భారత జట్టు 1984 నుంచి 2016 వరకు ఒక్క ఒలింపిక్‌ పతకం కూడా నెగ్గలేకపోయింది. 

మళ్లీ 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో  కాంస్య పతకాన్ని సాధించి తమ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా గతేడాది జరిగిన పారిస్‌ ఒలిం‍పిక్స్‌లో కూడా మన హాకీ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

 భారత హాకీకి వందేళ్లు పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. నవంబర్ 7న న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ఈ ఉత్సవాలను కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవియా ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement