breaking news
indian hockey federation
-
భారత హాకీ దిగ్గజం చరణ్జిత్ సింగ్ కన్నుమూత
Hockey Legend Charanjit Singh Passed Away: భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత చరణ్జిత్ సింగ్(90) కన్నుమూశారు. 1964 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారధిగా వ్యవహరించిన ఈ మాజీ మిడ్ ఫీల్డ్ ఆటగాడు.. ఇవాళ ఉదయం హిమాచల్ ప్రదేశ్లోని తన స్వగృహంలో తనువు చాలించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుత్ను ఆయన.. కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు దృవీకరించారు. చరణ్జిత్ మరణ వార్తను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. చరణ్జిత్ సింగ్ మృతి పట్ల భారత హాకీ సమాఖ్య విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించింది. On behalf of Hockey India, we mourn the loss of a great figure of Indian Hockey, Shri Charanjit Singh.May his soul Rest in Peace🙏 pic.twitter.com/PTb38lHDS6— Hockey India (@TheHockeyIndia) January 27, 2022 చదవండి: అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ -
క్రీడలపై క్రీనీడ!
సంపాదకీయం: క్రీడల విషయంలో ఈ దేశప్రజల గుండెల్లో ఎప్పటినుంచో గూడుకట్టుకున్న అసంతృప్తిని సర్వోన్నత న్యాయస్థానం గురువారం తన వ్యాఖ్యల్లో ప్రతిబింబించింది. రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలు ‘ఆడిందే ఆట’గా సాగుతున్న క్రీడారంగాన్ని సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇలాంటి అవాంఛనీయ పరిణామాల కారణంగా క్రీడల్లో మన సత్తా నానాటికీ క్షీణిస్తుంటే, జోక్యంచేసుకుని చక్కదిద్దాల్సిన కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోతున్నదని దుయ్యబట్టింది. ఇండియన్ హాకీ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్)కూ, హాకీ ఇండియా(ఐహెచ్)కూ మధ్య నెలకొన్న వివాదంపై తమ ముందుకొచ్చిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ చలమేశ్వర్లతో కూడిన ధర్మాసనం చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నదగినవి. క్రీడా సంఘాలనేవి వాస్తవానికి మట్టిలో మాణిక్యాలను వెతికిపట్టేవిగా ఉండాలి. మెరికల్ని గుర్తించి వారి ప్రతిభను సానబట్టే స్థాయిలో పనిచేయాలి. ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహమిచ్చేవిగా రూపొందాలి. నిష్ణాతులైన క్రీడాకారుల్ని పంపి, విశ్వ క్రీడారంగంలో మన దేశ పతాకాన్ని సమున్నతంగా ఎగిరేలా చేయాలి. కానీ, అదేం ఖర్మమో...ఇలాంటి సంఘాలన్నీ కొందరికి ‘కులాసా క్లబ్బు’ల్లా తయారయ్యాయి. తమ తమ రంగాల్లో అలసి సొలసిపోతున్న వారికి ‘ఆటవిడుపు’ సంస్థలుగా మారాయి. ఇలాంటివారంతా పీఠాధిపతులుగా మారి, ముఠాలుకట్టి నిజమైన క్రీడాకారులను ఎదగనివ్వకుండా చేస్తున్నారు. ప్రతిభతో పనిలేకుండా నచ్చినవారిని అందలం ఎక్కిస్తున్నారు. అందువల్లే అంతర్జాతీయ క్రీడా రంగస్థలిలో మనం నగుబాటు పాలవుతున్నాం. మనకు పతకాలు అందని ద్రాక్షలవుతున్నాయి. దేశంలో నలభైకి పైగా క్రీడా సమాఖ్యలున్నాయి. వీటన్నిటిలోనూ దశాబ్దాలుగా కొందరే అధికారం చలాయిస్తున్నారు. నిరుడు ఆగస్టులో లండన్లో జరిగిన ఒలింపిక్స్లో మన దేశం ఆరంటే ఆరే పతకాలు సాధించి తెల్లమొగం వేసింది. అంతకు నాలుగేళ్లముందు బీజింగ్ ఒలింపిక్స్లో ఒక్క స్వర్ణం సాధించుకోగా, లండన్లో అదీ లేకుండాపోయింది. అప్పుడున్న యాభయ్యో స్థానంనుంచి లండన్లో 55వ స్థానానికి పడిపోయాం. రూ.200 కోట్లకు పైగా వ్యయంతో తర్ఫీదునిచ్చి 81 మంది క్రీడాకారుల్ని పంపితే ఎవరూ సంతృప్తికరంగా ఆడలేక పోయారు. ఒకప్పుడు మనకు గర్వకారణంగా నిలిచిన హాకీ క్రీడలో దారుణంగా ఓడిపోయాం. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్నే ప్రస్తావించింది. క్రీడా సమాఖ్యల్లో పెత్తనం చలాయిస్తున్నవారిలో చాలామందికి ఆయా క్రీడలతో సంబంధమే లేని వైనాన్ని నిలదీసింది. ఈ దేశం తరఫున అంతర్జాతీయ ఈవెంట్లలో ప్రాతినిధ్యం వహించడానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) గుర్తింపు తమకివ్వాలంటే తమకివ్వాలంటూ తగువులాడుకున్న రెండు సంస్థల తీరునూ దుయ్యబట్టింది. అసలు మీ సంఘాల నిర్వాహకుల్లో ఒలింపియన్లు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించింది. అడగవలసిన ప్రశ్నే ఇది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారగణం తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఇలాంటి సమాఖ్యల్లో తిష్టవేస్తున్నారు. క్రీడాకారులు, శిక్షకులు, టీం మేనేజర్ల ఎంపికంతా ఇష్టానుసారం చేస్తున్నారు. సమాఖ్యలన్నిటా ఆర్ధిక, నైతిక అరాచకత్వం, ఆశ్రీతపక్ష పాతం రాజ్యమేలుతున్నాయి. వేర్వేరు మార్గాల్లో ఆయా సమాఖ్యలకొచ్చే కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమవుతుండగా, మహిళా క్రీడాకారిణులకు లైంగిక వేధింపులు సర్వసాధారణమయ్యాయి. మన ఒలింపిక్ అసోసియేషన్ అరాచకానికి విసిగి నిరుడు డిసెంబర్లో అంతర్జాతీయ ఒలింపిక్ సంస్థ దాని గుర్తింపును రద్దుచేసింది. మన కేంద్ర క్రీడల మంత్రి వినతిమేరకు ఈమధ్యే నిషేధాన్ని తొలగించింది. ఈ దురదృష్టకర పరిస్థితులను సరిదిద్దడానికి రెండేళ్లక్రితం ఒక ప్రయత్నం జరిగింది. క్రీడా సమాఖ్యల్లో పారదర్శకత తీసుకొచ్చి, వాటికి జవాబుదారీతనాన్ని అలవాటు చేయడం కోసమని జాతీయ క్రీడాభివృద్ధి బిల్లును రూపొందించారు. అయితే, కేంద్ర కేబినెట్లో ఉంటూ కొన్ని క్రీడా సంస్థల్లో పెత్తనం చేస్తున్న మంత్రులు దానికి గంటికొట్టారు. చివరకు ఆ బిల్లు అటకెక్కింది. దాని స్థానంలో మరో ముసాయిదా బిల్లు తయారైంది. రాజకీయనాయకుల, వ్యాపారవేత్తల పెత్తనాన్ని నిరోధించడానికి అనువైన అంశాలు ఇందులో లేకపోయినా... కార్యనిర్వాహక వర్గంలో ఉండేవారు 70 ఏళ్ల వయసు వచ్చేసరికి రిటైరయ్యేలా నిబంధన ఉంచారు. అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వరసగా మూడేళ్లపాటు, కార్యనిర్వాహకవర్గంలో ఉండేవారు వరసగా రెండు దఫాలు మాత్రమే పోటీచేయడానికి అర్హులన్న నిబంధన పెట్టారు. ఏ క్రీడా సమాఖ్య అయినా సమాచార హక్కు చట్టం పరిధిలో ఉండాల్సిందేనని నిర్దేశించారు. ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిధులు పొందే సంస్థలు ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమాఖ్యల్లో 10 శాతం మంది మహిళలుండాలని నిబంధన విధించారు. క్రీడా సమాఖ్యల్లో పేరుకుపోయిన ముఠాతత్వానికి, అరాచకత్వానికి ఈ కొత్త బిల్లు ఎంతవరకూ అడ్డుకట్ట వేయగలదో అనుమానమే. క్రీడలతో సంబంధంలేని వ్యక్తుల బంధనాల నుంచి సమాఖ్యలను సంపూర్ణంగా విముక్తి చేస్తే తప్ప ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో కాస్తయినా మార్పువచ్చే అవకాశమేలేదు. సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యానాల వెలుగులో బిల్లును మరింత సానబట్టాలి. అట్టడుగు స్థాయినుంచి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా...ఔత్సాహిక క్రీడాకారుల నైపుణ్యానికి మెరుగులద్దేలా, క్రీడా సంఘాల అవ్యవస్థను చక్కదిద్దేలా బిల్లు సమగ్రంగా ఉండాలి. అలాగని సమాఖ్యలు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లకూడదు. అవి స్వతంత్రంగా, పారదర్శకంగా, వృత్తిై నెపుణ్యంతో పనిచేయాలి. ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఈ గడ్డపై మళ్లీ క్రీడా సంస్కృతి వెల్లివిరుస్తుంది. విశ్వక్రీడా వేదికపై మనవాళ్ల ప్రతిభ కాంతులీనుతుంది.