ఆదుకున్న రవితేజ, అహ్మద్ ఖాద్రీ | Sakshi
Sakshi News home page

ఆదుకున్న రవితేజ, అహ్మద్ ఖాద్రీ

Published Sun, Nov 24 2013 12:00 AM

Raviteja,ahmad khadri sucessfull in second innings

ధర్మశాల: బ్యాట్స్‌మెన్ రాణించడంతో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో కోలుకుంది. రవితేజ (118 బంతుల్లో 73, 12 ఫోర్లు), అహ్మద్ ఖాద్రీ (115 బంతుల్లో 77 బ్యాటింగ్, 14 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ప్రస్తుతం 260 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా చేతిలో మూడు వికెట్లున్నాయి. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 99 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.
 
 రాణించిన అక్షత్, విహారి
 శనివారం 40/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన హైదరాబాద్ కాసేపటికే ఓపెనర్ తిరుమలశెట్టి సుమన్ (63 బంతుల్లో 30, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ అక్షత్ రెడ్డికి రవితేజ జతయ్యాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు.
 
 
 అయితే జట్టు స్కోరు 99 పరుగుల వద్ద అక్షత్ (112 బంతుల్లో 43, 7 ఫోర్లు) అక్షయ్ చౌహాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్ 99 పరుగుల వద్ద ఓపెనర్లిద్దర్నీ కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విహారి (83 బంతుల్లో 41, 8 ఫోర్లు) రవితేజతో కలిసి ఇన్నింగ్స్‌ను గాడినపెట్టాడు. ఇద్దరూ చూడచక్కని బౌండరీలతో ఆకట్టుకున్నారు. మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం విహారినీ అక్షయ్ చౌహానే పెవిలియన్ పంపాడు. తర్వాత వచ్చిన సందీప్ (9) విఫలమయ్యాడు. ఈ వికెట్ కూడా అక్షయ్ ఖాతాలోకే వెళ్లింది.
 
 ఖాద్రీ అజేయ అర్ధసెంచరీ
 సందీప్ నిష్ర్కమణతో క్రీజులోకి వచ్చిన అహ్మద్ ఖాద్రీ నింపాదిగా ఆడాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రవితేజను రిషి ధావన్ బోల్తాకొట్టించాడు. ఈ దశలో హైదరాబాద్ స్కోరును పెంచే బాధ్యతల్ని ఖాద్రీ తన భుజాన వేసుకున్నాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్‌ను కుదుటపర్చాడు. హబీబ్ అహ్మద్ (28) చక్కటి సహకారం అందించడంతో ఖాద్రీ అర్ధసెంచరీ సాధించాడు. జట్టు స్కోరును క్రమంగా 300 పరుగులు దాటించాడు. కనిష్క్ నాయుడు డకౌట్ కాగా ఆట ముగిసే సమయానికి అబ్సోలెం (4 బ్యాటింగ్)తో కలిసి ఖాద్రీ క్రీజులో ఉన్నాడు. హిమాచల్ బౌలర్లలో చౌహాన్ 5, రిషి ధావన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆదివారం ఆటకు చివరి రోజు కాగా హైదరాబాద్ ప్రత్యర్థి ముందు 300 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించగలిగితే మ్యాచ్‌లో నిలబడే అవకాశం ఉంటుంది.
 
 స్కోరు వివరాలు
 హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 237; హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 296; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: సుమన్ (సి) ఆతిశ్ (బి) రిషి ధావన్ 30; అక్షత్ (సి) ఆతిశ్ (బి) అక్షయ్ చౌహాన్ 43; రవితేజ (సి) ఆతిశ్ (బి) రిషి ధావన్ 73; విహారి (సి) ఆతిశ్ (బి) అక్షయ్ చౌహాన్ 41; సందీప్ (బి) అక్షయ్ చౌహాన్ 9; అహ్మద్ ఖాద్రీ బ్యాటింగ్ 77; హబీబ్ అహ్మద్ (సి) రిషి ధావన్ (బి) అక్షయ్ చౌహాన్ 28; కనిష్క్ నాయుడు (సి) చోప్రా (బి) అక్షయ్ చౌహాన్ 0; అబ్సోలెం బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (99 ఓవర్లలో 7 వికెట్లకు) 319
 వికెట్ల పతనం: 1-58, 2-99, 3-181, 4-195, 5-231, 6-290, 7-292
 బౌలింగ్: విక్రమ్‌జిత్ 26-7-86-0, రిషి ధావన్ 31-8-84-2, అహ్మద్ 14-2-35-0, బిపుల్ శర్మ 2-0-14-0, అక్షయ్ చౌహాన్ 23-3-80-5, అభినవ్ బాలి 3-0-15-0
 

Advertisement
 
Advertisement
 
Advertisement