‘ఫుల్ ప్లేట్’ చిత్రంలోని ఓ దృశ్యం
ధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నేటి నుంచి నవంబర్ 2 వరకు
హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో చిత్రదర్శకురాలు రీతు సరిన్ నాటిన విత్తనం ఇప్పుడు పెద్ద చెట్టు అయింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌గా ప్రపంచ ప్రసిద్ధి పొందింది...ధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (డిఐఎఫ్‌ఎఫ్) ఈరోజు నుండి నవంబర్ 2 వరకు జరుగుతుంది.
మహిళా దర్శకుల 40 చిత్రాలతో సహా మొత్తం 88 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రముఖ చిత్ర దర్శకురాలు కిరణ్‌రావుతో ముఖాముఖి ఉంటుంది. తన సినిమా ప్రయాణం నుంచి ఇండిపెండెంట్ సినిమాలలో వస్తున్న మార్పుల వరకు తన అభి్రపాయాలను ఈ ముఖాముఖీలో తెలుసుకోవచ్చు.
రీతు కృషి... ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దిల్లీలో పుట్టి పెరిగిన రీతు సరిన్ కాలిఫోర్నియా కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్(సిసిఏ)లో ఫిల్మ్ అండ్ వీడియో విభాగంలో ఎంఎఫ్‌ఏ చేసింది. ‘సిసిఏ’లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు తీసింది. ది సిఖ్స్ ఆఫ్ యూబా సిటీ, టిబెట్, ఫిష్‌టేల్స్, ఎ స్ట్రేంజర్ ఇన్ మై నేటివ్ ల్యాండ్, ది షాడో సర్కస్....మొదలైన ఎన్నో ప్రయోగాత్మకమైన చిత్రాలను తీసింది.
టిబెటన్ చిత్రదర్శకుడు టెన్‌జింగ్ సోనమ్‌ను వివాహం చేసుకుంది. 2012లో సోనమ్‌తో కలిసి వైట్ క్రేన్ ఆర్ట్స్ అండ్ మీడియా అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఆ తరువాత సోనమ్‌తో కలిసి ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(డిఎఫ్‌ఎఫ్)కు శ్రీకారం చుట్టింది. టాప్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో డిఐఎఫ్‌ఎఫ్ ఒకటిగా నిలిచింది.
మరచిపోయిన చెట్టు పాట ఒకటి
ధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యే చిత్రాలలో అనుపర్ణ రాయ్ రచన, దర్శకత్వం వహించిన ‘సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్’ ఒకటి. 82వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోని ఒరిజోంటి (హారిజన్స్) విభాగంలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఈ విభాగంలో ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డ్ గెల్చుకున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్‌మేకర్‌గా ప్రత్యేకత నిలుపుకుంది రాయ్. ఈ చిత్రకథ విషయానికి వస్తే...
బాలీవుడ్‌లో అవకాశాలు వెదుక్కుంటూ ఎక్కడినుంచో ముంబైకి వచ్చి ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది తోయ. శ్వేత అనే మరో యువతి కూడా బతుకుదెరువు కోసం ముంబైకి వస్తుంది. కాల్–సెంటర్‌లో పనిచేసే శ్వేత, తోయతో పాటు అదే అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది. కాలక్రమేణా వారి మధ్య నిశ్శబ్ద అనుబంధం ఏర్పడుతుంది. అది ఎలాంటి అనుబంధం, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారనేదే సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్ కథ. పశ్చిమ బెంగాల్ పురులియ జిల్లాలోని నారాయణ్‌పూర్‌కు చెందిన అనుపర్ణరాయ్ ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసింది. సినిమా రంగంలోకి రావడానికి ముందు దిల్లీలోని ఒక కాల్‌సెంటర్‌లో, ముంబైలో ఐటీ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది.
హైప్ కాదు... సహజంగానే!
దేశంలోని ప్రముఖ స్వతంత్ర చలనచిత్రోత్సవాలలో ఒకటిగా ఎదగాలని మేమూ ఎప్పుడూ అనుకోలేదు. అర్థవంతమైన, అద్భుత సినిమాలకు ప్రశాంతమైన పర్వతాలు వేదికగా ఉండాలని మాత్రం గట్టిగా అనుకున్నాం. హైప్ ద్వారా కాకుండా గత 14 సంవత్సరాలుగా డిఐఎఫ్‌ఎఫ్ సహజంగా అభివృద్ధి చెందింది. చిత్రనిర్మాతల అభిరుచి, ప్రేక్షకుల విశ్వాసం డిఐఎఫ్‌ఎఫ్ విజయానికి కారణం.
– రీతు సరిన్, ఫిల్మ్ మేకర్, డిఐఎఫ్‌ఎఫ్ ఫౌండర్
స్త్రీవాద కోణంలో..
రేణుక షహానే మరాఠీ యానిమేటెడ్ లఘుచిత్రం ‘లూప్ లైన్’ డిఐఎఫ్‌ఎఫ్‌లో ప్రదర్శితం కానుంది. మధ్యతరగతి మహిళల జీవితాలపై తీసిన చిత్రం ఇది. రకరకాల భావోద్వేగాలతో పాటు, మాటలతో హింసించడం అనేది కుటుంబ వ్యవస్థలో ఎంత సాధారణంగా మారిందో చెబుతుంది లూప్ లైన్. 
స్త్రీవాద దృక్పథంతో తీసిన ఈ లఘుచిత్రం ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. తస్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్, ముంబై షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకుంది.
స్త్రీ విముక్తి
తనిష్ట ఛటర్జీ దర్శకత్వం వహించిన ‘ఫుల్ ప్లేట్’ చిత్రం డిఐఎఫ్‌ఎఫ్‌లో ప్రదర్శితం కానుంది. తన దర్శకత్వలో వచ్చిన తొలిచిత్రం ‘రోమ్ రోమ్ మెయిన్’కు మేరీ క్లైర్ ఆసియా స్టార్ అవార్డ్ అందుకుంది. 
‘ఫుల్ ప్లేట్’ అనేది స్త్రీ విముక్తికి సంబంధించిన చిత్రం. స్త్రీల సమస్యను సీరియస్‌గా కాకుండా చమత్కార రీతిలో చెప్పిన చిత్రం. ఈ చిత్రంలో వంటను సామాజిక శాస్త్ర విశ్లేషణ సాధనంగా చూపారు.


