‘19 ఏళ్ల వయసు.. 30 ఏళ్ల అనుభవం’

Rashid Khans 19 year old body has 30 year old mind, says Phil Simmons - Sakshi

కాబూల్‌: ఇటీవల కాలంలో సంచలన ప్రదర్శనతో దుమ్మురేపుతున్న అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌పై ఆ జట్టు కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. 19 ఏళ్ల వయసులో 30 ఏళ్ల అనుభవాన్ని రషీద్‌ ఖాన్‌ గడించేశాడని సిమన్స్‌ కొనియాడాడు. ఇందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఎంతో దోహదం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన రషీద్ ఖాన్.. మొత్తం 17 మ్యాచ్‌లాడి 21 వికెట్లతో సత్తాచాటాడు. ప్రధానంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌, బ్యాటింగ్, ఫీల్డింగ్‌కి ప్రపంచ వ్యాప్తంగా మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. అతని ఆటకి ఫిదా అయిన భారత క్రికెట్ అభిమానులు రషీద్‌కి భారత పౌరసత్వం ఇవ్వాలంటూ ట్విటర్‌లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంచితే, బెంగళూరు వేదికగా జూన్ 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టుతో అఫ్గానిస్తాన్ ఆడనున్న తరుణంలో ఫిల్ సిమన్స్ మీడియాతో మాట్లాడాడు. ‘రషీద్ ఖాన్ వయసు ఇప్పుడు 19 ఏళ్లే. కానీ.. అతను ఇప్పటికే 30 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిలా కనబడుతున్నాడు. భారత్‌తో చారిత్రక టెస్టులో రషీద్‌ ఎలా ఆడతాడో చూద్దాం. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన నాలుగు రోజుల క్రికెట్‌ మ్యాచ్‌లో రషీద్‌ అద్భుతమైన పరిణితి కనబరిచాడు. జట్టు తన నుంచి ఏం ఆశిస్తుందో..? అతనికి బాగా తెలుసు. భారత్‌పై రషీద్‌ రాణిస్తాడనే ఆశిస్తున్నా. టెస్టు మ్యాచ్‌లకు సహనం అనేది చాలా అవసరం. అతని సహచర స్పిన్నర్ ముజీబ్ వయసు 17 ఏళ్లే. అతను ఇంకా యువకుడు.. నేర్చుకోవాల్సి ఉంది ’ అని కోచ్ ఫిల్ సిమన్స్ వెల్లడించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top