
గత రెండేళ్లుగా టెస్టులకే పరిమినతమైన ఈ దిగ్గజం
కోలంబో: ముత్తయ్య మురళీధరన్ తర్వాత శ్రీలంక తరుపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీసే తన ఆఖరి సిరీస్ కావచ్చు అని ప్రకటించాడు. శ్రీలంక దిగ్గజ ఆటగాళ్లు సంగక్కర, జయవర్దనే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టెస్టుల్లో ఈ వెటరన్ స్పిన్నర్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా టెస్టులకే పరిమినతమైన ఈ దిగ్గజం నిలకడగా రాణిస్తున్నాడు.
సీనియర్ ఆటగాడిగా జట్టు బాధ్యతలు మోస్తూ, యువ ఆటగాళ్లకు స్పూర్తి నింపడంలో సఫలమయ్యాడు. నలభై యేళ్ల ఈ లెఫ్టార్మ్ బౌలర్ స్వదేశంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగే టెస్టు సిరీస్ అనంతరం ఆటకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించాడు.
రికార్డులు.. శ్రీలంక తరుపున 90 టెస్టుల్లో 418 వికెట్లు, 71వన్డేల్లో74 వికెట్లు, 17 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ బౌలర్‌గా హెరాత్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో పాక్ దిగ్గజ బౌలర్ వసీం ఆక్రమ్ (414) ఉన్నాడు. హెరాత్ శ్రీలంకకు ఐదు టెస్టులకు నాయకత్వం వహించగా మూడు టెస్టులు గెలవగా, రెండింట ఓటమి చవిచూసింది.