జీఎం హోదాకు చేరువలో రాహుల్‌ శ్రీవత్సవ్‌

Rahul Srivatshav Will Join Elite List Very Soon - Sakshi

మూడో నార్మ్‌ సొంతం చేసుకున్న తెలంగాణ ప్లేయర్‌

సాక్షి, హైదరాబాద్‌: చదరంగంలో తెలంగాణ నుంచి త్వరలోనే మరో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) అవతరించనున్నాడు. హైదరాబాద్‌ క్రీడాకారుడు, 18 ఏళ్ల రాహుల్‌ శ్రీవత్సవ్‌ ఈ హోదాకు చేరువయ్యాడు. వెనిస్‌ వేదికగా జరిగిన మోంట్‌బెలూనా ఓపెన్‌ చెస్‌ టోర్నీలో మెరుగ్గా రాణించిన ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం) రాహుల్‌... గ్రాండ్‌ మాస్టర్‌ హోదా పొందడానికి అవసరమైన మూడో నార్మ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో తనకన్నా మెరుగైన ప్రత్యర్థులతో ఆడిన రాహుల్‌ నాలుగు గేమ్‌ల్లో గెలుపొంది,

ఐదు గేమ్‌ల్ని డ్రా చేసుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లు ముగిశాక 6.5 పాయింట్లతో అతను మూడో స్థానంలో నిలిచాడు. తొలి రెండు గేమ్‌ల్లో సాహిన్‌ ఓజ్‌గన్‌ (టర్కీ), ఐఎం సంకల్ప్‌ గుప్తా (భారత్‌)లపై గెలుపొందిన రాహుల్‌ మూడు, నాలుగు గేమ్‌ల్లో వరుసగా మార్టినెజ్‌ జోస్‌ ఎడ్యుర్డో (పెరూ), ఓజెన్‌ డెనిజ్‌ (టర్కీ)లతో డ్రా చేసుకున్నాడు. తర్వాతి రెండు గేమ్‌లలో బర్సెయాన్‌ హరుత్యున్‌ (ఫ్రాన్స్‌), నికోలోవ్‌స్కీ నికోలా (మసెడోనియా)లపై నెగ్గాడు. తర్వాత వరుసగా ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు స్మిర్నోవ్‌ అంటోన్‌ (ఆస్ట్రేలియా), జనన్‌ ఇవ్‌జెనీ (ఇజ్రాయెల్‌), టెర్‌ సమక్యాన్‌ సామ్‌వెల్‌ (అర్మేనియా)లతో గేమ్‌లను డ్రా చేసుకున్నాడు.

నిబంధనల ప్రకారం గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొందడానికి మూడు జీఎం నార్మ్‌లతో పాటు 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లు కచ్చితంగా సాధించాల్సి ఉంది. అయితే రాహుల్‌ మరో 31 ఎలో రేటింగ్‌ పాయింట్లు వెనుకబడి ఉండటంతో జీఎం హోదా పొందడానికి మరింత కాలం ఆగాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే రాహుల్‌ ఇటలీలో జరిగే మరిన్ని టోర్నీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. రాహుల్‌ అనుకున్నది సాధిస్తే... ఇరిగైసి అర్జున్, హర్ష భరతకోటి తర్వాత తెలంగాణ తరఫున మూడో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరిస్తాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top