సింధు నిష్క్రమణ

 PV Sindhu Loses To Chen Yu Fei  - Sakshi

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో భారత స్టార్‌కు రెండో పరాజయం

సెమీస్‌ అవకాశాలు ఆవిరి

నేడు హి బింగ్‌జియావోతో చివరి మ్యాచ్‌

ఆగస్టులో విశ్వవిజేతగా అవతరించాక ఆడిన ఆరు టోర్నీల్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లోనూ తడబడింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వరుసగా రెండో పరాజయం చవిచూసి ఈ టోర్నీ లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. నేడు జరిగే మూడో లీగ్‌ మ్యాచ్‌లో సింధు గెలిస్తే ఆమెకు సీజన్‌ను విజయంతో ముగించిన ఊరట లభిస్తుంది.   

గ్వాంగ్‌జౌ (చైనా): గత రెండేళ్లలో బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో టైటిల్‌ పోరుకు చేరడంతోపాటు గతేడాది చాంపియన్‌గా కూడా నిలిచిన భారత స్టార్‌ పీవీ సింధు ఈసారి మాత్రం నిరాశ పరిచింది. సెమీఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సింధు పోరాడి ఓడిపోయింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ చెన్‌ యుఫె (చైనా)తో గురువారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్‌ సింధు 22–20, 16–21, 12–21తో ఓటమి చవిచూసింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో 17–20తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా విజృంభించిన సింధు వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను 22–20తో దక్కించుకుంది.

అయితే ఈ ఏడాది ఆరు సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన చెన్‌ యుఫె రెండో గేమ్‌లో పుంజుకుంది. ఆరంభంలోనే 8–4తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో చెన్‌ యుఫె తన దూకుడు కొనసాగించి సింధు ఆట కట్టించింది. మరో మ్యాచ్‌లో అకానె యామగుచి 25–27, 21–10, 21–13తో హి బింగ్‌జియావో (చైనా)పై గెలిచింది. గ్రూప్‌ ‘ఎ’లో రెండేసి మ్యాచ్‌లు నెగ్గినందుకు చెన్‌ యుఫె, యామగుచి సెమీఫైనల్‌కు చేరారు. నేడు జరిగే నామమాత్రపు మ్యాచ్‌ల్లో హి బింగ్‌జియావోతో సింధు; యామగుచితో చెన్‌ యుఫె తలపడతారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top