జాతీయ సీనియర్ అత్యాపత్యా చాంపియన్‌షిప్‌లో పుదుచ్చేరి జట్లు సత్తాచాటాయి.
జాతీయ అత్యాపత్యా చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ అత్యాపత్యా చాంపియన్‌షిప్‌లో పుదుచ్చేరి జట్లు సత్తాచాటాయి. స్థానిక ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో పురుషులు, మహిళల విభాగాల్లో టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాయి. శనివారం జరిగిన పురుషుల ఫైనల్లో పుదుచ్చేరి జట్టు 2–0తో మహారాష్ట్ర జట్టుపై గెలిచి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో పుదుచ్చేరి తరఫున రాణించిన రాజకుమార్, మహారాష్ట్ర జట్టులో ఉమేశ్ షిండేలకు ‘బెస్ట్ ప్లేయర్స్’ పురస్కారాలు దక్కాయి.
అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో మహారాష్ట్ర 2–0తో కర్ణాటక జట్టుపై, పుదుచ్చేరి 2–0తో తమిళనాడు జట్టుపై విజయం సాధించాయి. మహిళల విభాగంలో జరిగిన ఫైనల్లోనూ పుదుచ్చేరి జట్టు 2–0తో మహారాష్ట్ర జట్టునే ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్న భానుప్రియ (పుదుచ్చేరి), శీతల్ షిండే (మహారాష్ట్ర)లకు ‘బెస్ట్ ప్లేయర్స్’ అవార్డులు లభించాయి. సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో పుదుచ్చేరి 2–0తో కేరళ జట్టుపై గెలవగా... మహారాష్ట్ర 2–0తో కర్ణాటక జట్టును ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహు మతి ప్రదాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఆసియా అత్యాపత్యా సమాఖ్య జనరల్ సెక్రటరీ దీపక్ పి. కవీశ్వర్, తెలంగాణ అత్యాపత్యా సంఘం అధ్యక్షులు ప్రదీప్ కుమార్, కార్యదర్శి ముఖేశ్ తదితరులు పాల్గొన్నారు.