సైరా కబడ్డీ...

Pro Kabaddi League 2019 - Sakshi

నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌–7

మూడు నెలల పాటు వినిపించనున్న చెడుగుడు కూత

హైదరాబాద్‌లోనే మొదలు

తొలి పోరులో యు ముంబాతో తెలుగు టైటాన్స్‌ ‘ఢీ’

రాత్రి గం. 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

ఆరు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న కబడ్డీ ఆరు నెలలకే మళ్లీ వచ్చేసింది. ఐపీఎల్‌ తర్వాత అంతటి ఊపును తీసుకొచ్చిన ప్రొ కబడ్డీ లీగ్‌ కూత మరోసారి మోత మోగించనుంది. 12 జట్లు... 92 రోజులు... 137 మ్యాచ్‌లు... ఇక వినోదానికి లోటేముంది. నేటి నుంచి జరిగే సీజన్‌–7తో కబడ్డీ ... కబడ్డీ... కబడ్డీ అంటూ శ్రుతి కలిపేందుకు మీరు సిద్ధమేనా...?  

సాక్షి, హైదరాబాద్‌
ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం లీగ్‌ తెరపైకి వచ్చి అనూహ్యంగా సూపర్‌ సక్సెస్‌గా నిలిచిన ఈ టోర్నీ విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 5న ఆరో సీజన్‌ ఫైనల్‌ జరగ్గా అదే జోరులో 2019లో రెండో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో తెలుగు టైటాన్స్, యు ముంబా మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రొ కబడ్డీ లీగ్‌ ప్రారంభమవుతుంది. అక్టోబర్‌ 19న గ్రేటర్‌ నోయిడాలో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. గత సీజన్‌లాగే ఈసారి కూడా 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. హైదరాబాద్‌ అంచె పోటీలు ఈనెల 26 వరకు జరుగుతాయి.  

కొత్త ఫార్మాట్‌తో 137 మ్యాచ్‌లు...
ప్రొ కబడ్డీ లీగ్‌–7కు సంబంధించి ప్ర«ధాన మార్పు ఫార్మాట్‌ విషయంలో జరిగింది. ఇంతకుముందు రెండు వేర్వేరు జోన్‌లు, వాటిలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు తర్వాతి దశ, ఆపై చివరి దశ అంటూ గందరగోళంగా షెడ్యూల్‌ కనిపించింది. దాంతో దీనిని పూర్తిగా మార్చి అభిమానులకు ఆసక్తి రేపేలా చేశారు.  
► ఐపీఎల్‌ తరహాలో ప్రతీ జట్టు మరో టీమ్‌తో రెండేసి సార్లు తలపడుతుంది. అంటే ఒక్కో టీమ్‌ కనీసం 22 లీగ్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. సొంత వేదికపై మాత్రం గరిష్టంగా నాలుగు మ్యాచ్‌లకు మించి ఏ జట్టుకూ ఆడే అవకాశం రాదు. లీగ్‌ దశ అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు బరిలో నిలిస్తే...తర్వాతి ఆరు జట్లు టోర్నీనుంచి    తప్పుకుంటాయి.   

► తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్లు రెండు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు ఆడి విజయం ద్వారా సెమీస్‌లో అడుగు పెట్టే అవకాశం ఉంది. సరిగ్గా మూడు నెలల సాగే ఈ లీగ్‌లో ఏకంగా 137 మ్యాచ్‌లు జరుగుతుండటం విశేషం. ప్రతీసారి ఏదో ఒక  స్లోగన్‌ను లీగ్‌కు ఆకర్షణగా తెస్తున్న నిర్వాహకులు ఈసారి ‘ఇస్‌ సే టఫ్‌ కుచ్‌ నహీ...(ఇంతకంటే క్లిష్టం మరోటి లేదు)’ పేరుతో లీగ్‌కు ప్రచారం నిర్వహించారు.  

వేదికలు...
12 జట్లు తమ సొంత వేదికలను ఎంచుకున్నాయి. గత సీజన్లో తెలంగాణలో ఎన్నికల కారణంగా వైజాగ్‌లో హోం మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్‌ ఈసారి హైదరాబాద్‌నే సొంత వేదికగా తీసుకుంది. దీంతో పాటు ముంబై, పట్నా, అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, పుణే, జైపూర్, పంచకుల, గ్రేటర్‌ నోయిడాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతీ అంచె మ్యాచ్‌లు శనివారం ప్రారంభమవుతాయి. ప్రతి మంగళవారం మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. శని, ఆది, బుధ, శుక్రవారాల్లో హోం జట్లు తమ మ్యాచ్‌లను ఆడతాయి.   

పట్నాదే జోరు...
లీగ్‌లో ఆరు సీజన్లలో పట్నా పైరేట్స్‌ జట్టు దూకుడు కొనసాగింది. ఏకంగా మూడు సార్లు ఆ జట్టు విజేతగా నిలవడం విశేషం. జైపూర్‌ పింక్‌ పాంథర్స్, యు ముంబా ఒక్కోసారి టైటిల్‌ గెలుచుకున్నాయి. గత సీజన్‌లో ట్రోఫీ అందుకున్న బెంగళూరు బుల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.  

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌...
కబడ్డీ అంటే కుర్రాళ్లు మాత్రమే కాదు మేం కూడా ఆడగలమంటూ కొందరు వయసులో నిమిత్తం లేకుండా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వీరిలో జోగీందర్‌ నర్వాల్‌ (37 ఏళ్లు–ఢిల్లీ), జీవకుమార్‌ (38 ఏళ్లు–బెంగాల్‌), ధర్మరాజ్‌ చేరలతన్‌ (43 ఏళ్లు–హరియాణా) ఆటపై అందరి దృష్టి ఉంది.  

కెన్యా నుంచి కూడా...
లీగ్‌లో భారత ఆటగాళ్లతో పాటు పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అందరిలోకి అగ్రభాగం ఇరాన్‌దే. టైటాన్స్‌ కెప్టెన్‌ అబోజర్‌ సహా మొత్తం 15 మంది ఇరాన్‌ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌కు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అమెరికన్‌ ఫుట్‌బాల్‌ (రగ్బీ) ఆడే డెవిట్‌ జెన్నింగ్స్‌ను టైటాన్స్‌ తమ జట్టులోకి తీసుకున్నా... చివరి నిమిషంలో వేరే కారణాలతో అతడిని తప్పించింది.

లీగ్‌ టాపర్స్‌
అత్యధిక పాయింట్లు: రాహుల్‌ చౌదరి (876)
అత్యధిక రైడ్‌ పాయింట్లు: పర్‌దీప్‌ నర్వాల్‌ (858)
అత్యధిక టాకిల్‌ పాయింట్లు: మన్‌జీత్‌ ఛిల్లర్‌ (302)
ఎక్కువ సార్లు ప్రత్యర్థిని ఆలౌట్‌: పట్నా పైరేట్స్‌ (165)

మాజీ చాంపియన్స్‌
సీజన్‌       విజేత
2014       జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌
2015       యు ముంబా
2016       పట్నా పైరేట్స్‌ (జనవరి; జూన్‌)
2017       పట్నా పైరేట్స్‌
2018–19    బెంగళూరు బుల్స్‌

నేటి మ్యాచ్‌లు
తెలుగు టైటాన్స్‌ X యు ముంబా
రాత్రి  గం. 7.30 నుంచి

బెంగళూరు బుల్స్‌ X పట్నా పైరేట్స్‌
రాత్రి గం. 8.30 నుంచి

సీజన్‌–7 కెప్టెన్లు వీరే... 
► మణీందర్‌ సింగ్‌ (బెంగాల్‌ వారియర్స్‌)
► జోగీందర్‌ నర్వాల్‌ (దబంగ్‌ ఢిల్లీ)
► సునీల్‌ కుమార్‌ (గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌)
► రోహిత్‌ కుమార్‌ (బెంగళూరు బుల్స్‌)
► దీపక్‌ హుడా (జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌)
► పర్‌దీప్‌ నర్వాల్‌ (పట్నా పైరేట్స్‌)
► సుర్జీత్‌ సింగ్‌ (పుణేరీ పల్టన్‌)
► అజయ్‌ ఠాకూర్‌ (తమిళ్‌ తలైవాస్‌)
► అబోజర్‌ మొహాజిర్‌ మిగాని (తెలుగు టైటాన్స్‌)
► నితీశ్‌ కుమార్‌ (యూపీ యోధ)
► ఫజల్‌ అత్రచలి (యు ముంబా)
► ధర్మరాజ్‌ చేరలతన్‌ (హరియాణా స్టీలర్స్‌) 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top