ఎలిమినేటర్–3లో పట్నాపై గెలుపు
నేడు పుణేరి పల్టన్‌పై నెగ్గితే ఫైనల్‌కు
న్యూఢిల్లీ: వరుస విజయాలతో విజృంభిస్తున్న తెలుగు టైటాన్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో ఫైనల్‌కు విజయం దూరంలో నిలిచింది. మంగళవారం హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్–3లో తెలుగు టైటాన్స్ 46–39 పాయింట్ల తేడాతో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై నెగ్గింది. టైటాన్స్ తరఫున భరత్ హూడా 23 పాయింట్లతో మెరిశాడు. పట్నా పైరేట్స్ తరఫున అయాన్ 22 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.
ఈ సీజన్‌లో అయాన్ 20కి పైగా పాయింట్లు సాధించడం ఇది ఆరోసారి. తద్వారా ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు 20కి పైగా పాయింట్లు సాధించిన రెయిడర్‌గా అయాన్ చరిత్ర సృష్టించాడు. పీకేఎల్ 12వ సీజన్‌లో అయాన్ 316 పాయింట్లు సాధించడం విశేషం. గత సీజన్‌లో 184 పాయింట్లు నమోదు చేసుకున్న అతడు... ఈసారి పట్నా పైరేట్స్ ఎలిమినేటర్–3 వరకు రావడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇరు జట్లు మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించగా... టైటాన్స్ 29 రెయిడ్ పాయింట్లు, పట్నా 27 రెయిడ్ పాయింట్లు సాధించాయి. ఇరు జట్లు రెండేసి సార్లు ఆలౌట్ కాగా... రెండేసి ఎక్స్‌ట్రా పాయింట్లు సాధించాయి. ట్యాక్లింగ్‌లో మెరుగ్గా నిలిచిన టైటాన్స్ ముందంజ వేసింది. నేడు జరిగే క్వాలిఫయర్–2లో పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఫైనల్లో దబంగ్ ఢిల్లీతో టైటిల్ కోసం పోటీపడుతుంది.


