సిద్ధార్థ్‌ దేశాయ్‌కు రూ.1.45 కోట్లు

Pro Kabaddi 2019 players auction - Sakshi

సొంతం చేసుకున్న తెలుగు టైటాన్స్‌

తమిళ్‌ తలైవాస్‌ గూటికి రాహుల్‌ చౌదరి

ప్రొ కబడ్డీ లీగ్‌ వేలం

ముంబై:  ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ –7 కోసం జరిగిన వేలంలో 27 ఏళ్ల సిద్ధార్థ్‌ శిరీష్‌ దేశాయ్‌ పంట పండింది. సోమవారం ఇక్కడ జరిగిన  వేలంలో తెలుగు టైటాన్స్‌ జట్టు సిద్ధార్థ్‌ను రూ. 1 కోటి 45 లక్షలకు సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సిద్ధార్థ్‌ గత సీజన్‌లో యు ముంబాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆరో సీజన్‌లో అతను అత్యధిక పాయింట్ల జాబితాలో మూడో స్థానంలో (221 పాయింట్లు) నిలిచాడు. వేలంలో కోటి రూపాయలు దాటిన జాబితాలో రెండో ఆటగాడిగా నితిన్‌ తోమర్‌ నిలిచాడు.

పుణేరీ పల్టన్‌ రూ. 1.20 కోట్లు చెల్లించి ‘ఫైనల్‌ బిడ్‌ మ్యాచ్‌’ ద్వారా తోమర్‌ను రిటైన్‌ చేసుకుంది. వేలంలో జరిగిన ప్రధాన మార్పులలో హర్యానా స్టీలర్స్‌ టాప్‌ రైడర్‌ మోను గోయత్‌... యూపీ యోధ (రూ. 93 లక్షలు)కు తరలి వెళ్లగా... ప్రొ కబడ్డీ లీగ్‌ ప్రారంభమమైన నాటినుంచి తెలుగు టైటాన్స్‌తోనే ఉన్న స్టార్‌ ఆటగాడు రాహుల్‌ చౌదరి ఈ సారి తమిళ్‌ తలైవాస్‌ (రూ. 94 లక్షలు)కు మారాడు. మరో ఆటగాడు సందీప్‌ నర్వాల్‌ను యు ముంబా (రూ. 89 లక్షలు) దక్కించుకుంది.

విదేశీ ఆటగాళ్లలో ఇరాన్‌కు చెందిన మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ నబీ బ„Š కు అత్యధిక మొత్తం దక్కింది. బెంగాల్‌ వారియర్స్‌ రూ. 77.75 లక్షలకు ఇస్మాయిల్‌ను తీసుకుంది. ఇరాన్‌కే చెందిన అబోజర్‌ మొహజల్‌ మిగానికి రూ. 75 లక్షలు చెల్లించి తెలుగు టైటాన్స్‌ అట్టిపెట్టుకోవడం విశేషం. విదేశీ ఆటగాళ్లలో జంగ్‌ కున్‌ లి (పట్నా– రూ. 40 లక్షలు), మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ మగ్సూదు (పట్నా – రూ. 35 లక్షలు), డాంగ్‌ గియోన్‌ లీ (యు ముంబా – రూ. 25 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తెలుగు టైటాన్స్‌ అబోజర్‌తో పాటు విశాల్‌ భరద్వాజ్‌ను కొనసాగించింది.

జూలై 19నుంచి టోర్నీ
ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ జూలై 19 నుంచి అక్టోబర్‌ 9 వరకు జరుగుతుంది. గత సీజన్‌లో ప్రేక్షకాదరణ తగ్గడంతో మళ్లీ పాత షెడ్యూలునే ఖారారు చేశారు. ఆరో సీజన్‌ చాలా ఆలస్యంగా అక్టోబర్‌లో ప్రారంభించారు. అయితే ఆ సమయంలో వరుసగా పెద్ద పండగలు ఉండటంతో వీక్షకుల శాతం తగ్గింది. దీంతో ఏడో సీజన్‌ను గతంలోలాగే జూలైలోనే మొదలుపెట్టి ఫెస్టివల్స్‌కు ముందే ముగిస్తామని లీగ్‌ కమిషనర్‌ అనుపమ్‌ గోస్వామి తెలిపారు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top