ప్రజ్నేశ్‌@ 97

Prajnesh Gunneswaran rises to career-best 97 in ATP rankings - Sakshi

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో భారత ప్లేయర్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సర్క్యూట్‌లో నిలకడగా రాణిస్తున్న భారత టెన్నిస్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రజ్నేశ్‌ ఆరు స్థానాలు ఎగబాకి 97వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌  నుంచి సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్, యూకీ బాంబ్రీ తర్వాత గత పదేళ్ల కాలంలో పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–100లో చోటు పొందిన మరో ప్లేయర్‌ ప్రజ్నేశే కావడం విశేషం. ‘ఇదో గొప్ప మైలురాయి. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. నేనింకా చాలా లక్ష్యాలు నిర్దేశించుకున్నాను. ఈ సీజన్‌లో వాటిని అధిగమిస్తానని నమ్మకంతో ఉన్నాను.

ఫిట్‌నెస్‌ పరంగా, ఆటపరంగా చాలా అంశాల్లో నేను మెరుగవ్వాల్సి ఉంది’ అని తమిళనాడుకు చెందిన 28 ఏళ్ల ప్రజ్నేశ్‌ వ్యాఖ్యానించాడు. ప్రజ్నేశ్‌ టాప్‌–100లో కొనసాగితే అతనికి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లలో నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో ఆడే అవకాశం వస్తుంది. ప్రజ్నేశ్‌ తర్వాత రామ్‌కుమార్‌ రామనాథన్‌ 128వ స్థానంలో, యూకీ బాంబ్రీ 156వ ర్యాంక్‌లో ఉన్నారు. డబుల్స్‌లో రోహన్‌ బోపన్న 37వ స్థానంలో కొనసాగుతుండగా... దివిజ్‌ శరణ్‌ 39వ, లియాండర్‌ పేస్‌ 75వ, జీవన్‌ నెడుంజెళియన్‌ 77వ ర్యాంక్‌ల్లో ఉన్నారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top