పట్నా బెర్త్‌ యూపీ చేతిలో...

PKL 2018 today match Patna Pirates  beat Gujarat Fortunegiants  - Sakshi

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ చతికిలపడింది. ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో పట్నా 29–37తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ చేతిలో ఓడింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 28–30తో వెనుకంజలో ఉన్న పట్నా ఆ తర్వాత మరిన్ని పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ‘డుబ్కీ’ కింగ్‌ ప్రదీప్‌ నర్వాల్‌ రెండు సార్లు ఔటవడం ఫలితంపై ప్రభావం చూపింది. పట్నా తరఫున ప్రదీప్‌ 10 పాయింట్లు సాధించగా... గుజరాత్‌ తరఫున రోహిత్‌ 9, అజయ్‌ 8 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 37–31తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది.

నేటి మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్, బెంగాల్‌ వారియర్స్‌తో యూపీ యోధా తలపడనున్నాయి. జోన్‌ ‘బి’లో నిర్ణీత 22 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పట్నా ప్రస్తుతం 55 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 52 పాయింట్లతో యూపీ యోధ నాలుగో స్థానంలో ఉంది. నేడు బెంగాల్‌ వారియర్స్‌తో జరిగే మ్యాచ్‌లో యూపీ యోధ గెలిస్తే 57 పాయింట్లతో ‘ప్లే ఆఫ్‌’ బెర్త్‌ ఖాయం చేసుకుంటుంది. యూపీ యోధ ఓడిపోతే పట్నా పైరేట్స్‌ ‘ప్లే ఆఫ్‌’కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే... ఇరు జట్లు 55 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు పాయింట్ల తేడా కీలకం కానుంది. ప్రస్తుతానికి పాయింట్ల తేడా పరంగా పట్నా మెరుగ్గా ఉంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top