ఈ ఏడాది చివర్లో శ్రీలంకతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడదామని భారత్ చేస్తున్న ప్రతిపాదనను ఒప్పుకోవద్దని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ ఖాలిద్ మహమూద్ అభిప్రాయపడ్డారు.
కరాచీ: ఈ ఏడాది చివర్లో శ్రీలంకతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడదామని భారత్ చేస్తున్న ప్రతిపాదనను ఒప్పుకోవద్దని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ ఖాలిద్ మహమూద్ అభిప్రాయపడ్డారు. ప్రతి దానికి బీసీసీఐ వెంట మానుకోవాలన్నారు. వీలైనంత త్వరగా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడతామని భారత్ హామీ ఇస్తే ముక్కోణపు సిరీస్ ఆడేందుకు ఒప్పుకోవాలని సూచించారు. భారత్‌తో సుదీర్ఘ ఒప్పందాలు పెట్టుకోవడం వల్ల పాక్ క్రికెట్‌కు లాభం చేకూరుతుందన్నారు.
‘భారత్ ప్రతిపాదనను పీసీబీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించొద్దు. ఈ ముక్కోణపు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని స్వదేశంలో లంకతో సిరీస్‌ను రీ షెడ్యూల్ చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఎందుకంటే ముక్కోణపు సిరీస్ ఒక్క భారత్‌కే అనుకూలంగా ఉంటుంది. బీసీసీఐ ఏనాడూ పీసీబీకి మద్దతివ్వలేదు. వాళ్ల ప్రయోజనం కోసమే మన సిరీస్‌ను సవరించేలా ప్రయత్నిస్తున్నారు’ అని మహమూద్ పేర్కొన్నారు.