
'పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రత మాది'
వరల్డ్ టీ 20లో భాగంగా ఈనెల 19వ తేదీన నగరంలోని ఈడెన్ గార్డెన్ లో భారత్ తో తలపడనున్న పాకిస్తాన్ జట్టు భద్రతపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ లభించింది.
కోల్కతా: వరల్డ్ టీ 20లో భాగంగా ఈనెల 19వ తేదీన నగరంలోని ఈడెన్ గార్డెన్ లో భారత్ తో తలపడనున్న పాకిస్తాన్ జట్టు భద్రతపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ లభించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్లు లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలతో కూడిన రెండు లేఖలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్)అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి అందజేశారు. పాక్ క్రికెట్ భద్రతకు ఎటువంటి ఢోకా ఉండదని ఆ లేఖలో పేర్కొన్నారు.
తమ జట్టుకు భారత్ ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకమైన హామీ లభిస్తేనే వరల్డ్ టీ20లో పాల్గొంటామని పీసీబీ భీష్మించుకుని కూర్చున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా భారత్తో పాకిస్తాన్ తలపడే మ్యాచ్లపై అనిశ్చిత నెలకొన్న నేపథ్యంలో ధర్మశాలలో భారత్తో జరగాల్సిన మ్యాచ్ కోల్ కతాకు మారింది. దాంతో పాటు తమ ఆటగాళ్లు అక్కడ ఆడుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఎదుర్కోకూడదని, భారత ప్రభుత్వంనుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు తమ జట్టు భారత్‌కు బయల్దేరమని అని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి నిసార్ అలీ ఖాన్ చౌదరి పేర్కొన్నారు. లక్ష మంది సామర్థ్యం గల ఈడెన్‌గార్డెన్స్‌లోకి ఎవరైనా అవాంఛిత వ్యక్తులు వస్తే ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. దాంతో స్పందించిన క్యాబ్.. తమ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక హామీని ఐసీసీకి అందజేసింది.
మరోవైపు పాకిస్తాన్ కోరిన భారత ప్రభుత్వం హామీ మాత్రం లభించలేదు. భారత్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు సంబంధించి ఎలాంటి రాతపూర్వక హామీ ఇవ్వబోమని భారత్ శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకుకేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు.ఈ నేపథ్యంలో భారత్ లో పాకిస్తాన్ పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు.