ట్రయల్స్‌లో జరీన్‌పై మేరీకోమ్‌దే పైచేయి

Olympics Trails: Mary Kom Defeats Nikhat Zareen - Sakshi

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌తో జరిగిన పోరులో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌ ఘన విజయం సాధించారు. 51 కేజీల విభాగంలో ఈరోజు(శనివారం)  ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన పోరులో మేరీకోమ్‌ 9-1 తేడాతో నిఖత్‌ జరీన్‌పై గెలుపొందారు.  ఫలితంగా మేరీకోమ్‌ ఫిబ్రవరిలో జరుగనున్న ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు నేరుగా అర్హత సాధించారు. ఏకపక్షంగా సాగిన పోరులో మేరీకోమ్‌ పూర్తి ఆధిపత్యం కనబరిచారు. తనకంటే వయసులో ఎంతో చిన్నదైన నిఖత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకున్నారు.

51 కేజీలో విభాగంలో ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు భారత్‌నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం రేగడంతో మేరీకోమ్, నిఖత్‌ మధ్య పోటీ అనివార్యమైంది. మేరీకోమ్‌ ఇప్పటికే సాధించిన ఘనతలను బట్టి ఆమెనే పంపిస్తామని బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. మేరీకోమ్‌ కోసం నిబంధనలు కూడా మార్చే ప్రయత్నం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్‌ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రికి లేఖ రాయడంతో సమస్య తెరపైకి వచ్చింది.ఈ క‍్రమంలోనే శుక్రవారం జరిగిన తమ తొలి రౌండ్‌ మ్యాచ్‌లలో విజయాలు సాధించి వీరిద్దరు తుది పోరుకు సన్నద్ధమయ్యారు. నిఖత్‌ 10–0తో ప్రస్తుత జాతీయ చాంపియన్‌ జ్యోతి గులియాను, మేరీకోమ్‌ 10–0తో రితు గ్రేవాల్‌ను ఓడించారు. కాగా, ట్రయల్స్‌లో మాత్రం మేరీకోమ్‌దే పైచేయి అయ్యింది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top