బోల్తా పడ్డారు...

New Zealand Set India For 122/5 In First Test - Sakshi

తొలి టెస్టులో భారత్‌ 122/5

పేస్‌కు తలవంచిన బ్యాట్స్‌మెన్‌

జేమీసన్‌కు 3 వికెట్లు

మొదటి రోజు వర్షంతో అంతరాయం 

భయపడినట్లే జరిగింది... పచ్చని పచ్చికపై న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగానే భారత బ్యాటింగ్‌ బృందానికి పెద్ద సవాల్‌ ఎదురుగా నిలిచింది... స్వింగ్‌ను అధిగమించి పట్టుదలగా నిలబడాల్సిన చోట మనోళ్లు తడబడ్డారు. కివీస్‌ పేసర్లు చెలరేగిన వేళ టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఒకరి వెంట మరొకరు తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. చివరకు వర్షం రాకతో కాస్త తెరిపి లభించింది. వాన కారణంగా చివరి సెషన్‌ పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా... నేడు రెండో రోజు మన ఆటగాళ్లు ఎంతగా పోరాడి స్కోరును ఎక్కడి వరకు చేరుస్తారన్నది చూడాలి.

వెల్లింగ్టన్‌: టెస్టుల్లో నంబర్‌వన్‌ జట్టు భారత్‌ను న్యూజిలాండ్‌ తమ సొంతగడ్డపై నిలువరించింది. శుక్రవారం ఇక్కడి బేసిన్‌ రిజర్వ్‌ మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అజింక్య రహానే (122 బంతుల్లో 38 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (10 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉండగా... మయాంక్‌ అగర్వాల్‌ (84 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. పృథ్వీ షా (16), పుజారా (11), కోహ్లి (2) విఫలమయ్యారు. ఇదే మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌కు 3 వికెట్లు దక్కాయి. టీ విరామ సమయంలో కురిసిన వర్షం మళ్లీ ఆగకపోవడంతో అంపైర్లు ఆటను కొనసాగించలేకపోయారు. తొలి రోజు 35 ఓవర్ల ఆట సాధ్యం కాలేదు.

కోహ్లి విఫలం... 
భారత కొత్త ఓపెనింగ్‌ జోడి జట్టుకు కావాల్సిన ఆరంభాన్ని అందించలేకపోయింది. సౌతీ వేసిన అవుట్‌ స్వింగర్‌ పృథ్వీ షా (16) ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టింది. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా (11) కూడా ప్రభావం చూపలేకపోయాడు. కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి జేమీసన్‌ తొలి టెస్టు వికెట్‌గా వెనుదిరిగాడు. జేమీసన్‌ తర్వాతి ఓవర్లోనే భారత్‌కు పెద్ద దెబ్బ పడింది. ఆఫ్‌స్టంప్‌పై పడిన బంతిని డ్రైవ్‌ చేయబోయిన కోహ్లి (2) మొదటి స్లిప్‌లో టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ దశలో మయాంక్, రహానే జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. లంచ్‌ సమయానికి స్కోరు 79 పరుగులకు చేరింది.

డిఫెన్స్‌కే పరిమితం... 

రెండో సెషన్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ వికెట్‌ కాపాడుకునే ప్రయత్నంలో పూర్తిగా ఆత్మరక్షణా ధోరణిని కనబర్చారు. ఇదే ఒత్తిడిలో మయాంక్‌ వికెట్‌ కోల్పోయాడు. తన బౌలింగ్‌లో మయాంక్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను వదిలేసినా బౌల్ట్‌ మరో రెండు బంతులకే వికెట్‌ పడగొట్టాడు. షార్ట్‌ బంతిని పుల్‌ చేసే క్రమంలో లాంగ్‌లెగ్‌లో మయాంక్‌ క్యాచ్‌ ఇచ్చాడు. ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ విహారి (7) తనకు లభించిన అమూల్య అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

సాహా అవుట్‌... 
భారత జట్టు అనూహ్యంగా రెగ్యులర్‌ టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను తుది జట్టునుంచి తప్పించింది. కివీస్‌ మైదానాల్లో అదనపు బ్యాట్స్‌మన్‌ అవసరమని భావించిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సాహాకంటే మెరుగైన బ్యాట్స్‌మన్‌ అయిన పంత్‌ వైపు మొగ్గు చూపింది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) సౌతీ 16; మయాంక్‌ (సి) జేమీసన్‌ (బి) బౌల్ట్‌ 34; పుజారా (సి) వాట్లింగ్‌ (బి) జేమీసన్‌ 11; కోహ్లి (సి) టేలర్‌ (బి) జేమీసన్‌ 2; రహానే (బ్యాటింగ్‌) 38; విహారి (సి) వాట్లింగ్‌ (బి) జేమీసన్‌ 7; పంత్‌ (బ్యాటింగ్‌) 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (55 ఓవర్లలో 5 వికెట్లకు) 122.  
వికెట్ల పతనం: 1–16; 2–35; 3–40; 4–88; 5–101. 
బౌలింగ్‌: సౌతీ 14–4–27–1; బౌల్ట్‌ 14–2–44–1; గ్రాండ్‌హోమ్‌ 11–5–12–0; జేమీసన్‌ 14–2–38–3; ఎజాజ్‌ పటేల్‌ 2–2–0–0

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top