ధోని.. నీకు ఆ హక్కు ఎక్కడిదోయ్‌?

MS Dhoni Slammed for Confronting Umpire After No Ball Controversy - Sakshi

జైపూర్‌ : ‘అవును.. అది నోబాలే.. తొలుత ఇచ్చి తరువాత ఇవ్వలేదు.. అయోమయానికి గురై అంపైర్లు తప్పిదం చేశారు.. మరి మైదానంలోకి వెళ్లి ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడిదోయ్‌’ అంటూ మాజీ క్రికెటర్లు.. మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను ఇలా ప్రవర్తిస్తాడని ఊహించలేదని, ధోని తన ఆగ్రహాన్ని ఆపుకోలేక పెద్ద తప్పిదం చేశాడని, ఇది ఆటకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ట్విటర్‌ వేదికగా అభిప్రాయపడుతున్నారు. రాజస్తాన్‌ రాయల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ధోని అంపైర్లతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.

గెలుపు కోసం చెన్నై 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్‌ సాంట్నర్‌ 2 పరుగులు చేశాడు. అయితే ప్రధాన అంపైర్‌ గాంధే దీనిని తొలుత హైట్‌నోబాల్‌గా ప్రకటించి... ఆ తర్వాత లెగ్‌ అంపైర్‌ కాదనడంతో వెంటనే చేతిని దించేశాడు. ఈ క్రమంలో అయోమయం నెలకొనడంతో నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న జడేజా మొదట అంపైర్లను ప్రశ్నించాడు. తర్వాత కెప్టెన్‌ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదనకు దిగాడు. అయినా అంపైర్లు అది నోబాల్‌ కాదనడంతో చేసేదేమీలేక ధోని నిరాశగా డగౌట్‌ చేరాడు. ధోని వ్యవహరించిన తీరు సరైంది కాదని, ఇది ఐపీఎల్‌ నిబంధనలను అతిక్రమించడమేనని అతని మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ జరిమానా విధించారు. 

ఇక ధోని మైదానంలోకి వెళ్లడమే తమని ఆశ్చర్యానికి గురిచేసిందని, డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లు మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాదించడం సరైంది కాదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ వైఖెల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో అంపైరింగ్‌ ప్రమాణాలు రోజురోజుకి దారుణంగా పడిపోతున్నాయని, నోబాల్‌ ఇచ్చి మళ్లీ వెనక్కు తీసుకోవడం అంపైర్లది ముమ్మాటికి తప్పేనని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు. ఏది ఎమైనప్పటికి ధోనికి మైదానంలోకి వెళ్లే హక్కు లేదన్నాడు. మరోవైపు అభిమానులు సైతం ధోనిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘ధోనికి ఎవరైనా చెప్పండి.. అంపైర్లు దీపక్‌ చహర్‌లా ఉండరు’ అని సెటైరిక్‌గా ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top