సీఎస్‌కే ఖాతాలో ‘హ్యాట్రిక్‌’

IPL 2019 CSK Beat Rajasthan Royals To Record Successive Win - Sakshi

ఈ సీజన్‌లో సీఎస్‌కేకు హ్యాట్రిక్‌ విజయం

రాజస్తాన్‌కు తప్పని మరో ఓటమి

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టిన ధోని

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి ఎగబాకింది. ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్తాన్‌ టాపార్డర్‌ పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో రాహుల్‌ త్రిపాఠి(39), స్మిత్‌(28), బెన్‌ స్టోక్స్‌(46)లు పోరాడినప్పటికి జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చహర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, డ్వేన్‌ బ్రేవో, శార్దూల్‌లు తలో రెండు వికెట్లు తీశారు.
అంతకముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అంబటి రాయుడు(1), షేన్‌ వాట్సన్‌(13), కేదార్‌ జాదవ్‌(8)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో సురేశ్‌ రైనా-ఎంఎస్‌ ధోనిల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ  61 పరుగులు జత చేసిన తర్వాత రైనా పెవిలియన్‌ చేరగా, బ్రేవోతో కలిసి మరో చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ధోని.

ఈ క్రమంలోనే ఎంఎస్‌ ధోని(75 నాటౌట్‌; 46 బంతుల్లో  4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు తర్వాత ధోని బ్యాట్‌ ఝుళిపించాడు. ప్రధానంగా చివరి ఓవర్‌లో ధోని కొట్టిన హ్యాట్రిక్‌ సిక్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఉనాద్కత్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో చివరి మూడు బంతుల్ని ధోని సిక్సర్‌లుగా మలచడంతో సీఎస్‌కే స్కోరు బోర్డు వేగంగా కదిలింది. ఆ ఓవర్‌ రెండో బంతిని జడేజా సిక్స్‌ కొట్టగా, మూడో బంతి వైడ్‌ అయ్యింది. అటు తర్వాత జడేజా సింగిల్‌ తీయగా, ధోని తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్‌లో మొత్తంగా 28 పరుగులు వచ్చాయి. దాంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ధోని సాధించిన 75 పరుగులు అతని రెండో అత్యుత్తమ ఐపీఎల్‌ స్కోరుగా నమోదైంది. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో ఆర్చర్‌ రెండు వికెట్లు సాధించగా, ధావల్‌ కులకర్ణి, బెన్‌స్టోక్స్‌, ఉనాద్కత్‌లు తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Liveblog - సీఎస్‌కే ఖాతాలో ‘హ్యాట్రిక్‌’


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top