‘అందుకే ధోని మైదానంలోకి వెళ్లాడు​’

Fleming Says MS Dhoni only Just Wanted Clarity - Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌

జైపూర్‌ : చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని నోబాల్‌ స్పష్టత కోసమే మైదానంలోకి వెళ్లాడని ఆ జట్టు హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ప్లెమింగ్‌ స్పష్టం చేశాడు. గురువారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్రసింగ్‌ ధోని అంపైర్లతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. గెలుపు కోసం చెన్నై 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్‌ సాంట్నర్‌ 2 పరుగులు చేశాడు. అయితే ప్రధాన అంపైర్‌ దీనిని తొలుత  హైట్‌ నోబాల్‌గా ప్రకటించి... ఆ తర్వాత లెగ్‌ అంపైర్‌ కాదనడంతో వెంటనే చేతిని దించేశాడు. ఈ క్రమంలో అయోమయం నెలకొనడంతో నాన్‌- స్ట్రైక్లో ఉన్న జడేజా మొదట అంపైర్లను ప్రశ్నించాడు. తర్వాత కెప్టెన్‌ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు. కానీ అంపైర్లు అది నోబాల్‌ కాదనడంతో చేసేదేమీలేక ధోని నిరాశగా డగౌట్‌ చేరాడు. అయితే మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ధోని ఐపీఎల్‌ నిబంధన 2.20 అతిక్రమించాడని అతిని మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ జరిమాన విధించారు. 

ఇక మ్యాచ్‌ అనంతరం ఈ విషయంపై ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ.. ‘తొలుత అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌ ఇచ్చి మళ్లీ కాదనడంతో మేమంతా అయోమయానికి గురయ్యాం. ఇంతకు అది నోబాలా? కాదా? అనే సందిగ్ధంలో పడ్డాం. ఈ విషయంపై స్పష్టత కోసం ధోని మైదానంలోకి వెళ్లాడు. అంపైర్లతో చర్చించాడు. కేవలం క్లారిటీ కోసం మాత్రమే వారితో వాదనకు దిగాడు. ఇక ధోని చేసింది సరైనదా? కాదా? అనేది ప్రతి ఒక్కరు చర్చిస్తారు. ధోని కూడా ఈ విషయంపై పునరాలోచిస్తాడు. ఆ బంతి విషయంలో అంపైర్లు అయోమయానికి గురవ్వడంతో ధోని ఆగ్రహానికి గురయ్యాడు. అటువంటి కీలక పరిస్థితుల్లో ఎవరికైనా స్పష్టత అవసరం. ఇది సరైనది కాకపోవచ్చు. కానీ దీనిపై ధోనిని చాలా రోజులు చాలా సార్లు ప్రశ్నిస్తారు.’ అని ఫ్లెమింగ్‌ ధోని చేసింది సరైనదా కాదా? అన్న ప్రశ్నకు  ఇలా సమాధానం చెప్పకుండా దాటవేశాడు. మరోవైపు ఐపీఎల్‌లో అంపైర్ల తప్పిదాలు ఎక్కువయిపోయాయని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఆటగాళ్లు తప్పులు చేస్తే జరిమానాలు విధిస్తున్నారని, మరి అంపైర్లకేం శిక్షలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. అంపైర్లు ఘోర తప్పిదం చేశారని, కానీ ధోని చేసింది కూడా తప్పేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top