250 దరఖాస్తులు! 

More Than 250 Applicants for Indian Football team Coach job - Sakshi

భారత ఫుట్‌బాల్‌ కోచ్‌ పదవికి డిమాండ్‌  

న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్‌బాల్‌లో భారత్‌ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ప్రస్తుతం మన జట్టు ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో 103వ స్థానంలో ఉంది. అయినా సరే భారత జట్టు కోచ్‌ పదవిపై మాత్రం ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) కోచ్‌ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించగా... దాదాపు 250 మంది దీని కోసం ముందుకు రావడం విశేషం. మార్చి 29న ఈ ప్రక్రియ ముగిసింది. వీరిలో యూరోప్‌కు చెందిన పలువురు ప్రముఖ కోచ్‌లు కూడా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఆసియా కప్‌లో భారత్‌ నాకౌట్‌ దశకు చేరడంలో విఫలం కావడంతో కోచ్‌ స్టీఫెన్‌ కాన్‌స్టాంటైన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

అప్పటినుంచి కోచ్‌ స్థానం ఖాళీగా ఉంది. దరఖాస్తు చేసుకున్నవారిలో ఇండియన్‌ సూపర్‌ లీగ్, ఐ–లీగ్‌లలో కోచ్‌లుగా వ్యవహరించినవారు ఉన్నారు. ఈ జాబితాలో గియోవానీ బియాసీ (ఇటలీ), హాకెన్‌ ఎరిక్సన్‌ (స్వీడన్‌), రేమండ్‌ డామ్‌నెక్‌ (ఫ్రాన్స్‌), స్యామ్‌ అలార్డీస్‌ (ఇంగ్లండ్‌) తదితరులు ఉన్నారు. అయితే బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌కు అద్భుత విజయాలు అందించిన ఆల్బర్ట్‌ రోకా కోచ్‌ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు పేరు ప్రఖ్యాతులకంటే భారత జట్టు అవసరాలకు అనుగుణంగా కోచ్‌ను ఎంపిక చేస్తామని ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కుశాల్‌ దాస్‌ ఇప్పటికే చెప్పారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top