
మహ్మద్ షమీ అవుట్!
ఆసియాకప్కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగలింది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న భారత పేసర్ మహ్మద్ షమీ ఫిట్ నెస్ పరీక్షల్లో విఫలం చెందడంతో ఆసియాకప్ నుంచి వైదొలిగాడు.
న్యూఢిల్లీ: ఆసియాకప్కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగలింది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న భారత పేసర్ మహ్మద్ షమీకి నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో విఫలం చెందడంతో ఆసియాకప్ కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) శుక్రవారం ధృవీకరించింది. అతని స్థానంలో మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ కు జట్టులో స్థానం కల్పిస్తూ భారత సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. మహ్మద్ షమీ ఎడమ కాలి గాయం ఇంకా పూర్తిగా నయం కాలేకపోవడంతో జట్టు నుంచి అతన్ని తొలగిస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆసియా కప్, వరల్డ్ టీ 20లకు జట్టు ఎంపికలో భాగంగా ఫిబ్రవరి ఐదో తేదీ నాటికే షమీ ఫిట్ నెస్ నిరూపించుకోలేకపోయినా అతని జట్టులో స్థానం కల్పించారు. కాగా, అతనికి తాజాగా ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించినా విఫలం చెందడంతో ఆసియాకప్ కు దూరం కావాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా వరల్డ్ టీ 20 జట్టులో షమీ పాల్గొనడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పదేపదే గాయాల బారిన పడుతున్న షమీ.. ఆస్ట్రేలియా టూర్ నుంచి కూడా ఇలా అర్థాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే.