మేరీ కోమ్‌ మెరిసింది!

Mary Kom Clinches Gold Medal In 23rd President's Cup - Sakshi

ఇండోనేషియా ప్రెసిడెంట్స్‌ కప్‌ టోర్నీలో భారత్‌కు స్వర్ణం

ఫైనల్లో ఆస్ట్రేలియా బాక్సర్‌ ఫ్రాంక్స్ ఎప్రిల్‌పై మేరీకోమ్‌ విజయం

జకార్త : భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ స్వర్ణంతో మెరిసింది. ఆదివారం జరిగిన ఇండోనేసియా 23వ ప్రెసిడెంట్స్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో ఈ మణిపూర్‌ మణిపూస‌(51 కేజీలు) ఆస్ట్రేలియా బాక్సర్‌ ఫ్రాంక్స్ ఎప్రిల్‌ను 5-0తో చిత్తు చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్‌లు విసురుతూ.. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకొని భారత్‌కు పసిడిని అందించింది. ఈ విజయానంతరం పతకాన్ని అందుకున్న క్షణాలను ట్వీట్‌ చేస్తూ మేరికోమ్‌ సంతోషం వ్యక్తం చేసింది. ‘ప్రెసిడెంట్స్‌ కప్‌ ఇండోనేషియాలో నా దేశానికి.. నాకు స్వర్ణం దక్కింది. గెలవడమంటే ఎంత దూరమైన వెళ్లడానికి, అందరికంటే ఎక్కవ కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. నా కోచ్‌లకు, సహాయక సిబ్బందికి మనస్పూర్తిగా ధన్యవాదాలు’  అని ఆరుసార్లు ప్రపంచ చాంపియనైన మేరీకోమ్‌ పేర్కొంది.

36 ఏళ్ల మేరీకోమ్‌ మేలో జరిగిన భారత ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నీలోనే స్వర్ణం సాధించింది. ఒలింపిక్స్‌ ప్రణాళికలో భాగంగా ఆ నెలలోనే థాయ్‌లాండ్‌లో జరిగిన ఏషియన్‌ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనలేదు. గతేడాది ఢిల్లీలో ఆరో బాక్సింగ్‌ ప్రపంచ టైటిల్‌ను నెగ్గి ప్రపంచ మేటీ బాక్సర్‌గా గుర్తింపు పొందింది. రష్యాలోని యెకాటెరిన్బర్గ్ వేదికగా జరిగే ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌-2019లో నెగ్గి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని మేరీకోమ్‌ ఉవ్విళ్లూరుతోంది. ఈ చాంపియన్‌ షిప్‌ సెప్టెంబర్‌ 7 నుంచి 21 మధ్య జరగనున్నాయి. వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌ అనంతరం బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతానని ఈ ముగ్గురు పిల్లల బాక్సర్‌ ప్రకటించింది.

ఇక స్వర్ణం నెగ్గిన మేరీకోమ్‌కు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర కీడ్రాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మేరీకోమ్‌ను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ‘డియర్‌ మేరీకోమ్‌ నువ్వెప్పుడు దేశం గర్వించేలా చేస్తున్నావ్‌. ప్రెసిడెంట్స్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నీలో స్వర్ణం నెగ్గిన నీకు అభినందనలు’ అని పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం మేరీకోమ్‌ను అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలందుకోవాలని ఆకాంక్షించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top