'క్రికెట్' కాస్త కొత్తగా...

Many changes in the ICC rules

ఐసీసీ నిబంధనల్లో పలు మార్పులు

రేపటి నుంచి అమలు

బ్యాట్‌కు బంతికి మధ్య అంతరం తగ్గించే ప్రయత్నం  

భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఉపుల్‌ తరంగ పరుగు పూర్తి చేసే ప్రయత్నంలో నిర్ణీత సమయంలోపే బ్యాట్‌ను క్రీజులో ఉంచగలిగాడు. అయితే వేగంగా నేలను తాకిన బ్యాట్‌ అనూహ్యంగా గాల్లోకి లేచింది. సరిగ్గా అదే సమయంలో కీపర్‌ సాహా బెయిల్స్‌ పడగొట్టడంతో తరంగ రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతకు ముందు చాంపియన్స్‌ ట్రోఫీలో రోహిత్‌ శర్మ కూడా ఇదే తరహాలో అవుటయ్యాడు. అయితే ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై అలాంటిది నాటౌట్‌గా గుర్తిస్తారు. దీంతో పాటు మరికొన్ని నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా బ్యాట్‌ పరిమాణం, ఫుట్‌బాల్‌ తరహాలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మైదానం బయటకు పంపడంలాంటివి కూడా ఉన్నాయి.

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రూపొందించిన కొత్త నిబంధనలు ఈ నెల 28 నుంచి అమల్లోకి వస్తున్నాయి. భారత్‌–ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌–వెస్టిండీస్‌ సిరీస్‌లు ఇప్పటికే కొనసాగుతున్న కారణంగా మిగతా మ్యాచ్‌లను పాత నిబంధనల ప్రకారమే నిర్వహిస్తారు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా–బంగ్లాదేశ్, పాకిస్తాన్‌–శ్రీలంక సిరీస్‌ల నుంచి కొత్త రూల్స్‌ వర్తిస్తాయి. 2000 నుంచి ఇప్పటి వరకు అవసరాన్ని బట్టి ఐసీసీ క్రికెట్‌ నిబంధనల్లో ఆరు సార్లు మార్పుచేర్పులు చేసింది. ‘మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) క్రికెట్‌ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. దానికి అనుగుణంగానే ఐసీసీ కూడా వాటిని అనుసరించాలని నిర్ణయించింది. కొత్త మార్పులపై అంపైర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇకపై వీటిని అమలు చేసే సమయం ఆసన్నమైంది’ అని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌) జెఫ్‌ అలార్డిస్‌ చెప్పారు. ముఖ్యంగా బ్యాట్‌కు, బంతికి మధ్య అంతరం తగ్గించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. రేపటి నుంచి కొత్తగా అమల్లోకి రానున్న కొన్ని ప్రధాన ఐసీసీ నిబంధనల వివరాలు ఇలా ఉన్నాయి.

► బ్యాట్‌ పొడవు, వెడల్పులో ఎలాంటి పరిమితులు లేకపోయినా... బ్యాట్‌ మందం 67 మిల్లీ మీటర్లకు మించరాదు. అనుమానం వస్తే అంపైర్లు బ్యాట్‌ మందాన్ని పరికరంతో పరీక్షిస్తారు. ఇప్పటి వరకు వార్నర్‌ తదితరులు ఎక్కువ మందం కలిగిన భారీ బ్యాట్‌లు వాడుతున్నారు.

► బౌండరీ వద్ద గాల్లోకి ఎగిరి ఫీల్డర్లు పట్టే క్యాచ్‌లు ఇటీవల తరచుగా కనిపిస్తున్నాయి. బౌండరీ దాటి గాల్లోనే దాన్ని లోపలికి తోసి మళ్లీ వాటిని అందుకుంటున్నారు. అయితే ఇందులో మార్పు చేశారు. ఇకపై ఫీల్డర్‌ బంతిని తాకే సమయంలో కూడా అతను బౌండరీ లోపలే ఉండాలి. లేదంటే బౌండరీగా పరిగణిస్తారు.  

► బ్యాట్స్‌మన్‌ పరుగు పూర్తి చేసే సమయంలో ఫీల్డర్‌/కీపర్‌ వికెట్లు పడగొట్టడానికి ముందే అతని బ్యాట్‌గానీ, అతనుగానీ క్రీజులో చేరి... ఆ తర్వాత బ్యాట్‌ గాల్లోకి ఎగరడం లేదా బ్యాట్స్‌మన్‌ నియంత్రణ కోల్పోయినా అతను సురక్షితంగా క్రీజులో అడుగు పెట్టినట్లే లెక్క. దానిని రనౌట్‌గా పరిగణించరు.

► ఇప్పటి వరకు బ్యాట్స్‌మన్‌ ఒక్కసారి మైదానం వీడితే అతడిని వెనక్కి పిలవడానికి లేదు. అయితే అతను నాటౌట్‌గా తేలితే ఇకపై తర్వాతి బంతి వేసే లోపు మళ్లీ వెనక్కి పిలుచు కోవచ్చు. ‘హ్యాండిల్డ్‌ ద బాల్‌’ (వికెట్ల వైపు వెళ్లే బంతిని చేతితో ఆపడం) నిబంధనను పూర్తిగా తొలగించి దానిని ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’లోకి కలిపేశారు.

► ఐసీసీ లెవల్‌ 4 నిబంధన ప్రకారం మైదానంలో ఆటగాడు హద్దు మీరి దురుసుగా ప్రవర్తిస్తే అంపైర్‌ అతడిని మొత్తం మ్యాచ్‌లో ఆడకుండా తప్పించవచ్చు. ఉద్దేశపూర్వకంగా నోబాల్‌ వేసినప్పుడు, బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌ దాటి చాలా ముందుకు వచ్చి గార్డ్‌ తీసుకున్నప్పుడు చర్యలు తీసుకునే అధికారాన్ని అంపైర్లకు అప్పజెప్పారు.

► బౌలర్‌ బంతిని విసిరిన తర్వాత క్రీజులోకి చేరేలోపు రెండు సార్లు నేలను తాకితే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. పిచ్‌కు దూరంగా బంతి పడినా దానిని నోబాల్‌గానే ప్రకటిస్తారు. నోబాల్‌ కీపర్‌కు అందకుండా వెళ్లి బౌండరీని తాకితే బౌలర్‌ నోబాల్‌ మాత్రమే వేసినట్లు. బైస్‌ను అతని ఖాతాలో కలపరు.  

► బ్యాట్స్‌మన్‌ షాట్‌ కొట్టిన తర్వాత బంతి ఫీల్డర్‌ లేదా వికెట్‌ కీపర్‌ హెల్మెట్‌కు తగిలి వచ్చినా సరే... ఫీల్డర్‌ క్యాచ్‌ పడితే దానిని అవుట్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకు అలా వస్తే అది నాటౌట్‌గా ఉండేది.  

► అంతర్జాతీయ టి20ల్లో కూడా అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్‌)ను అమలు చేస్తారు. ఒక ఇన్నింగ్స్‌లో ఒక రివ్యూకు అవకాశం ఉంటుంది. టెస్టుల్లో రివ్యూ చేసిన సమయంలో ‘అంపైర్‌ నిర్ణయం’ సరైనదిగా డీఆర్‌ఎస్‌ చూపించినప్పుడు జట్టు ఒక రివ్యూను కోల్పోదు. దీని వల్ల ఇకపై ఇన్నింగ్స్‌కు 2 రివ్యూలు మాత్రమే ఉంటాయి. 80 ఓవర్ల తర్వాత అదనంగా మరో 2 రివ్యూలు చేరడం ఉండదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top